ఇంకా హనీమూన్ మూడ్ నుంచి బయట పడనే లేదు. అప్పుడే ఆ కొత్త జంట మధ్య రగడ మొదలైంది. దీనంతటికి కారణం భర్త తనకు సంబంధించి ఓ విషయాన్ని దాచిపెట్టడమే.
బట్టతల ఉందన్న విషయాన్ని భర్త దాచి తనను మోసగించాడని ఓ కొత్త పెళ్లి కూతురికి కోపం వచ్చింది. ఈ మేరకు ఆమె పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
మహారాష్ట్రలోని ముంబైలోని మీరా రోడ్‌కు చెందిన 29 ఏళ్ల చార్డెర్డ్ అకౌంటెంట్‌కు గత నెలలో పెళ్లి అయింది. పెళ్లయిన కొన్ని రోజులకు భర్తకు బట్టతల ఉందని భార్య గ్రహించింది.
ఈ విషయాన్ని పెళ్లికి ముందు తనకు చెప్పకుండా మోసం చేశాడంటూ ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో భర్త , అతని కుటుంబ సభ్యులు తనను మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెళ్లికి ముందు విగ్గు పెట్టుకుని మోసం చేశాడని సదరు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. పనిలో పనిగా అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని కూడా ఫిర్యాదు చేసింది.
అలాగే భర్త తనపై అనుమానంతో ఫోన్‌ను హ్యాక్ చేసి కాల్ రికార్డులు, చాటింగ్ విషయాలు చెక్ చేస్తున్నాడని తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.