అధికార పార్టీ వైసీపీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కేంద్రంగా రచ్చ సాగుతోంది. ఇప్పుడా పేరు వైసీపీలో కలకలం రేపుతోంది. తమ నాయకుడు వైఎస్ జగన్ అరెస్ట్, అనంతరం 16 నెలల పాటు జైల్లోనే వుండడానికి సీబీఐ మాజీ అధికారి లక్ష్మినారాయణే కారణమని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి.
దీంతో లక్ష్మినారాయణ పేరు చెబితే జగన్ మొదలుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతారు. సరిగ్గా ఈ సూక్ష్మాన్ని గ్రహించిన రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సొంత పార్టీ ఎంపీ భరత్పై లక్ష్మినారాయణ బాణం వదిలారు. ప్రమాదం గ్రహించిన ఎంపీ భరత్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దాడికి ఎదురు దాడే సమాధానం అంటూ జక్కంపూడి రాజాపై తనదైన స్టైల్లో ఘాటు విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘పార్టీకి నష్టం కలిగించిన వారిని, కేసులు ఉన్నవారిని దూరంగా పెడితే.. వారిని తీసుకువచ్చి పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. అలాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణతో సెల్ఫీలకు దిగారు’ అని రాజమహేంద్రవరం ఎంపీ భరత్రామ్పై జక్కంపూడి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తనపై జక్కంపూడి చేసిన విమర్శలకు ఎంపీ భరత్ దీటైన సమాధానం ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ …‘ మా కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని మాట్లాడుతు న్నారు. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. సీబీఐ మాజీ అధికారి లక్ష్మినారాయణతో నేను సెల్ఫీలు తీసుకున్నానని విమర్శించారు. నాపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. కాపు సమావేశంలో లక్ష్మినారాయణను కలిశాను. నేను పార్లమెంట్లో చాలా బాగా మాట్లాడానని లక్ష్మినారాయణ అన్నారు. నేను వెళ్లి సెల్ఫీ తీసుకోలేదు.. వీడియో దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది’ అని భరత్ అన్నారు.
ఒకవైపు బాధ్యతగల పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పరస్పరం విమర్శలు చేసుకుంటూ పార్టీని బజారుకీడుస్తుంటే వైసీపీ పెద్దలు మాత్రం చోద్యం చూడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఎవరికి వాళ్లు తిట్టుకుంటుంటే పార్టీ పరువు బజారుపాలు కాదా? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.