ట్రంప్ నెగ్గాలని బాగా ఆకాంక్షించారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీరాభిమానులు. ఆ మధ్య అమెరికా పర్యటనలో భాగంగా మోడీ కూడా ట్రంప్ విజయాన్ని ఆకాంక్షించారు.
ఆ తర్వాత ట్రంప్ ఇండియాకు వచ్చినప్పుడు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి.. అంగరంగ వైభవంగా పండగ చేశారు. ట్రంప్ తమ సమీప బంధువు అయినట్టుగా మోడీ భక్తులు స్పందిస్తూ వచ్చారు. అదెంత వరకూ వెళ్లిందంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నెగ్గాలని ఇండియాలో యజ్ఞాలు, యాగాలు చేశారు మోడీ భక్తులు. ఆ యాగాల్లో మోడీ ఫొటోలను కూడా వాడేశారు.
అయితే ఈ పూజలు ఫలించలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చిత్తవుతున్నారు. ట్రంప్ ప్రత్యర్థి బైడెన్ విజయం ఖరారు అయ్యింది. మరో రెండున్నర నెలల్లో ఆయన అధ్యక్ష పీఠాన్ని అధిష్టించనున్నారు. ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జార్జి బుష్(సీనియర్ బుష్) తర్వాత తొలి టర్మ్ పూర్తయిన వెంటనే అధికారాన్ని కోల్పోయిన అధ్యక్షుడిగా నిలుస్తున్నాడు ట్రంప్. విశేషం ఏమిటంటే.. బుష్ కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థే! ఇప్పుడు మరోసారి రిపబ్లికన్ అభ్యర్థి తొలి టర్మ్ పూర్తి కాగానే రెండో టర్మ్ అవకాశం పొందకుండా ఓడిపోయారు.
గత కొన్నేళ్లలో డెమొక్రాటిక్ అభ్యర్థులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలు వరసగా రెండు పర్యాయాలు విజయం సాధించారు. మధ్యలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జార్జి డబ్ల్యూ బుష్ రెండు పర్యాయాలు వరస విజయాలు సాధించారు.
మొత్తానికి అమెరికాలో ట్రంప్ విజయాన్ని తమ ఆకాంక్షగా, తమ ప్రతిష్టగా తీసుకున్న మోడీ భక్తులకు ఇలా ఝలక్ తగిలింది. ఒకవేళ ట్రంప్ నెగ్గి ఉంటే.. ఇక్కడ మోడీ భక్తులు ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసే వారో!