రవాణా శాఖ నిబంధనలను అతిక్రమించి బస్సులను నడిపిన వ్యవహారంలో దివాకర్ ట్రావెల్స్ పై భారీ జరిమానా పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు ఒక ప్రకటన చేశారు. దివాకర్ ట్రావెల్స్ నిబంధనలు అతిక్రమించిన తీరును చూస్తే.. వారిపై కనీసం వంద కోట్ల రూపాయల వరకూ జరిమానా పడే అవకాశాలున్నాయని ఆయన పేర్కొనడం గమనార్హం. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కొన్ని రకాల బస్సులపై నిషేధం ఉండగా, అలాంటి బస్సులనే జేసీ ట్రావెల్స్ లో నడిపినట్టుగా తెలుస్తోంది.
అశోక్ లేలాండ్ కంపెనీ స్క్రాప్ కింద అమ్మేసిన బస్సులను దివాకర్ ట్రావెల్స్ తెచ్చి ఇక్కడి రోడ్లపై తిప్పుతున్న వ్యవహారం బయటకు వచ్చినట్టుగా రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును జేసీ ట్రావెల్స్ అతిక్రమించిందని వారు పేర్కొన్నారు. జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు, జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమాదేవి పేరుతో పలు బస్సులు రిజిస్టర్ అయినట్టుగా వారు చెబుతున్నారు. సరైన పర్మిట్లు లేకుండా ఒక్క అనంతపురం జిల్లాలోనే అరవైకి పైగా బస్సులు తిరుగుతుండగా వాటిని సీజ్ చేసినట్టుగా అధికారులు పేర్కొన్నారు.