వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు బిగ్‌షాక్ తగిలింది. షర్మిల తర్వాత ఆమే అన్నంతగా అన్ని వ్యవహారాలను చక్కదిద్దే కీలక నాయకురాలు ఇందిరాశోభన్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఎదుగుతున్న వైఎస్సార్‌టీపీకి ఇందిరా శోభన్ నిష్క్రమణ పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఆమె పార్టీలోనే కొనసాగేలా బుజ్జగించేందుకు షర్మిల చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం.
ఇందిరా శోభన్ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపారు. తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను ఆమె వివరించారు. భవిష్యత్‌లో కూడా ప్రజాజీవితంలోనే ఉంటానని, తెలంగాణ సమాజం నుంచి ఇవే ఆదరాభిమానాలు కావాలని ఆమె కోరడం గమనార్హం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే షర్మిల పార్టీకి రాజీనామా చేశానని ఆమె స్పష్టం చేశారు. రాజీనామా లేఖలో ఏముందో తెలుసుకుందాం.
‘ ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. అది మీరు కోరుకుంటున్నట్లుగానే షర్మిలక్క వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశాను. రాజీనామాకు కారణం ఏంటంటే.. అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బతుకు బాగు కోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం, కొట్లాడుతూనే ఉన్నాను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటా.
అందుకు షర్మిలక్క వైఎస్సార్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని.. అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నేను ఈ పార్టీకీ రాజీనామా చేశాను. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాను. ప్రజాజీవితంలోనే ఉంటా. జనం కోసమే కదులుతా. ప్రజల కోసమే అడుగులు వేస్తా. ఇదే ఆదరాభిమానాలను ఇక ముందు కూడా మీ నుంచి నాకు ఉంటాయని, నన్ను నడిపిస్తారని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. ఇన్నాళ్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నాకు సహకరించిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదములు’ అని ఇందిరాశోభన్ ఆ ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉండగా ఇందిరాశోభన్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ బతికి బట్టకట్ట లేదనే భావనతో ఆమె ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, షర్మిల పార్టీలో చేరారు. షర్మిల పార్టీలో కూడా ఇందిరా శోభన్ బలమైన వాయిస్ వినిపిస్తూ వచ్చారు.
ఇటీవల తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బలపడుతోందన్న అభిప్రాయం ఉంది. దీంతో పాతకాపులంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతు న్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా శోభన్ కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.