బిహార్ తొలి రౌండ్ల కౌంటింగ్ లో వెనుకబడిన ఎన్డీయే కూటమి తర్వాత పుంజుకుంది. దాదాపు కోటి ఓట్ల కౌంటింగ్ పూర్తి అవుతున్న దశలో దశలో బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో కనిపిస్తూ ఉంది.
మొత్తం నాలుగు కోట్ల ఓట్ల వరకూ పోలయ్యాయని, అయితే ఇప్పటి వరకూ కోటి ఓట్ల కౌంటింగ్ మాత్రమే పూర్తయ్యిందని ఈసీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల సరళి ఇంకా మారవచ్చేమో అనే అభిప్రాయాలు ఆస్కారం ఏర్పడుతూ ఉంది.
ఎన్డీయే ముందంజలో కనిపిస్తున్నా.. ఇంకా విజయం పట్ల ఆర్జేడీ ఆశాభావంగానే ఉంది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆర్జేడీ వర్గాలు ప్రకటిస్తూ ఉండటం గమనార్హం!
ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ ను పరిశిలిస్తే.. ఎన్డీయే కూటమి 130 సీట్లలో లీడ్ లో ఉండగా, ఆర్జేడీ కూటమి 102 సీట్లలో లీడ్ లో ఉంది. పార్టీల వారీగా చూస్తే.. బీజేపీ 77 సీట్లలో లీడ్ లో ఉంది. ఆర్జేడీ 65, జేడీయూ 51, కాంగ్రెస్ పార్టీ 19, ఎల్జేపీ రెండు, ఇతరులు 29 సీట్లలో లీడ్ లో ఉన్నారు.
ప్రస్తుతానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనే నిలుస్తూ ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ప్రస్తుతం కొన్ని సీట్లలో ఎక్కువగానే లీడ్ లో ఉంది. అయితే జేడీయూ మాత్రం చాలా సీట్లను కోల్పోయింది.
ఇప్పటి వరకూ ఈ ఉన్న లీడ్స్ అన్నీ కూడా వందల ఓట్లలోనే అని టీవీల్లో చెబుతున్నారు. ఐదారు వందల ఓట్ల లీడ్ లో ఉన్న నియోజకవర్గాల సంఖ్య వంద వరకూ ఉందట! ఇంకా చాలా ఓట్ల కౌంటింగ్ మిగిలే ఉన్న నేపథ్యంలో, లీడ్ లు వందల ఓట్లలోనే ఉన్న దశను బట్టి.. ఆఖరి ఫలితాలు ఎలా వస్తాయనేది చెప్పలేని అంశమని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదా విషయంలో బీజేపీ, ఆర్జేడీల మధ్యన పోటాపోటీ పరిస్థితి కనిపించింది. కాసేపు ఆర్జేడీ లీడ్ లో ఉండగా, మరి కాసేపు బీజేపీ లీడ్ లోకి వస్తోంది. ఆధిక్యాలు స్వల్పంగానే ఉన్న నేపథ్యంలో.. ఆఖరి వరకూ స్పష్టత రాకపోవచ్చు. ఈసీ కూడా కౌంటింగ్ రాత్రి వరకూ జరుగుతుందని ఇప్పటికే ప్రకటించింది.