బీహార్ లెక్క: ఒక్క రోజులో 3971 కరోనా మృతులు

కరోనా విలయంలో తప్పుడు లెక్కలతో ఏమార్చాలని చూసిన బీహార్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆ తప్పుల్ని ఒప్పుకుంది, లెక్కల్ని సరిచేసుకుంది. ఫలితంగా నిన్న ఒక్కరోజు దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగింది. వాస్తవానికి ఒక్కరోజులోనే…

కరోనా విలయంలో తప్పుడు లెక్కలతో ఏమార్చాలని చూసిన బీహార్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆ తప్పుల్ని ఒప్పుకుంది, లెక్కల్ని సరిచేసుకుంది. ఫలితంగా నిన్న ఒక్కరోజు దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగింది. వాస్తవానికి ఒక్కరోజులోనే అంతమంది చనిపోలేదు, గతంలో చనిపోయినవారి సంఖ్యను తక్కువగా చూపి, ఇప్పుడు లెక్కలు సవరించడంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 

జూన్ 8న తమ రాష్ట్రంలో అప్పటివరకు కరోనా కారణంగా చనిపోయినవారి సంఖ్య 5458గా తేల్చి చెప్పింది బీహార్ ప్రభుత్వం. ఆ తర్వాతిరోజు వారి సంఖ్య 9429గా సవరించింది. ఒక్కరోజులోనే 72శాతం మందిని కొత్తగా మరణాల లిస్ట్ లో చేర్చింది.

తప్పు బయటపడింది ఎలాగంటే..?

బీహార్ ప్రభుత్వం కొవిడ్ కారణంగా మరణించినవారి కుటుంబాలకు 4 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాగా ప్రకటించింది. బక్సర్ జిల్లాలో కొంతమంది తమకు పరిహారం అందడం లేదని, కరోనా మరణాలను కూడా సహజ మరణాలుగా లెక్కతీశారంటూ కోర్టుకెక్కారు. బక్సర్ జిల్లా లెక్కల్లో తప్పులు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పాట్నా కోర్టు రాష్ట్రమంతా ఆడిట్ చేయాలని ఆదేశించింది.

దీంతో అధికార యంత్రాంగం నష్టనివారణ చర్యలు చేపట్టింది. హోమ్ ఐసోలేషన్లో ఉండి చనిపోయినవారు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయినవారు, కరోనా నుంచి కోలుకున్నాక ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయినవారు.. ఇలా అందరి లిస్ట్ ని అప్ డేట్ చేసింది. దీంతో మరణాల సంఖ్య 72 శాతం పెరిగింది.

ఇది ఒక్క బీహార్ లో ఉన్న సమస్య మాత్రమే కాదు. మొదటినుంచి కేంద్రం మరణాల విషయంలో ఉదాసీనంగానే ఉంది. భారత్ లో సెకండ్ వేవ్ ఉధృతి, మరణాల సంఖ్యలో దాచిపెడుతున్న వాస్తవాల గురించి విదేశీ మీడియా కథనాలు రాసినా కేంద్రం కొట్టిపారేసిందే కానీ, పట్టించుకోలేదు. అటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరణాల లిస్ట్ విషయంలో ఉదాసీనంగా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య తక్కువగా నమోదైంది.