వైసీపీ యువ కెరటం, మాటల తూటాలు పేల్చే కర్నూలు యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పార్టీకి అందించిన సేవల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించారు. పాదయాత్ర సమయంలో బైరెడ్డికి ఇచ్చిన హామీ మేరకు కీలక నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారు.
బైరెడ్డిని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్‌గా నియమించడంతో ఆయనకు తగిన గుర్తింపు లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌కు మొదటి నుంచి గట్టి మద్దతుదారుడిగా బైరెడ్డి నిలిచారు. ఈ క్రమంలో తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డికి ఎదురొడ్డి నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెదనాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి అనుచరులకు ఉనికే లేకుండా చేయడంలో సిద్ధార్థ్ కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రధాన ప్రత్యర్థి టీడీపీని తన నియోజకవర్గంలో బలహీనపరచడంలో సిద్ధార్థ్ దూకుడు ప్రదర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్ధర్ గెలుపులో సిద్ధార్థ్ ముఖ్య భూమిక పోషించారు.
అయితే ఎన్నికల అనంతరం బైరెడ్డి సిద్ధార్థ్, ఎమ్మెల్యే ఆర్ధర్ మధ్య పొసగడం లేదు. పలుమార్లు వాళ్లిద్దరి మధ్య విభేదాలు వీధికె క్కాయి. కానీ ప్రజాబలం కలిగిన సిద్ధార్థ్‌కు పార్టీ అండదండలు అందిస్తోంది. ఈ క్రమంలో నేడు శాప్ చైర్మన్‌గా నియమించడంతో యువ నాయకత్వానికి లభించిన గుర్తింపుగా పలువురు చెబుతున్నారు.
బైరెడ్డికి శాప్ చైర్మన్ అనౌన్స్ కాగానే ఆయన అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు సిద్ధార్థ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సంబరాలు చేసుకున్నారు. బైరెడ్డి సిద్ధార్థ్ శాప్ చైర్మన్‌గా మున్ముందుకు ఎవరితో ఆట ఆడతారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.