బీజేపీ-జనసేన. రెండూ వేర్వేరు పార్టీలు కాదు, ఒకటే మాట, ఒకటే బాట, అధికారంలోకి వచ్చేవరకు అలుపెరగని పోరాటం.. ఇలా చాలానే చెప్పారు ఆ రెండు పార్టీల నేతలు. ఇక నుంచి ఏ పనైనా కలిసే చేస్తాం, వైసీపీని కలిసే ఎదుర్కొంటామని పొత్తు ఖరారు చేసుకున్న రోజు మీడియా ముందు గొప్పలు చెప్పారు.
కట్ చేస్తే.. ప్రతిసారీ బీజేపీ-జనసేన ఎడమొహం పెడమొహంగానే ఉన్న విషయం బయటపడుతోంది. రెండు పార్టీల మధ్య సయోధ్య అసలేమాత్రం లేదు, అదే ఉంటే.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో రత్నప్రభకు కనీసం డిపాజిట్ అయినా దక్కేది.
పన్నులకు వ్యతిరేకంగా బీజేపీ సోలో పెర్ఫామెన్స్..
ఏపీలో ఆస్తి పన్ను పెంచారని, చెత్త పన్ను కొత్తగా మొదలు పెట్టారంటూ బీజేపీ తెగ ఇదైపోతోంది. పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారా అంటూ నిలదీస్తోంది. వ్యాక్సిన్ పేరుతో పెట్రోలు రేట్లను కేంద్రం భారీగా పెంచడాన్ని మాత్రం ఆ పార్టీ రాష్ట్ర నేతలు నిస్సిగ్గుగా సమర్థించుకోవడం విడ్డూరం.
ఆ సంగతి పక్కనపెడితే బీజేపీ చేపట్టిన ఈ నిరసనలు, ఆందోళనలలో జనసేనకు స్థానం లేకపోవడం విచిత్రం. అవును, జనసేను బీజేపీ పూర్తిగా పక్కనపెట్టేసింది. ఏపీలో పన్నుల పెంపు ప్రధాన సమస్య అయినప్పుడు, జనసేనను కూడా కలుపుకొని వెళ్లాలి కదా, పొత్తు ధర్మం అంటే ఇదేనా..? ఎన్నికలొచ్చినప్పుడు ప్రతిసారీ బీజేపీ కోసం పవన్ కల్యాణ్ త్యాగం చేస్తున్నారు కదా, తనతోపాటు జనసైనికులందరితో త్యాగాలు చేయిస్తున్నారు కదా? ఇవన్నీ బీజేపీ మరిచిపోయినట్టుంది.
పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసంలో ఉన్నాడు కాబట్టి.. ఆయనను ఈ కార్యక్రమానికి తీసుకు రాలేకపోయింది బీజేపీ. మరి మిగతా నాయకులు, కార్యకర్తలు బీజేపీకి కనపడలేదా? జనసేన అంటే కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే అనుకుంటుందా? జనసైనికులు కనీసం బీజేపీకి ఆనడంలేదా..?
జనసేన కూడా చెత్తపన్నుపై స్పందించింది. అయితే కేవలం ఓ ప్రెస్ నోట్ రూపంలో ఈనెల 5న చెత్తపన్నుకి వ్యతిరేకంగా నాదెండ్ల మనోహర్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ తర్వాత బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేవలం తమ పార్టీ మాత్రమే హైలెట్ అయ్యేలా చూసుకుంది.
ఇదే పద్ధతి కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ మినహా.. ఇంకెవరీకి బీజేపీ పొత్తులో భాగంగా సీట్లు ఇవ్వదేమో. ఏపీలో బీజేపీ, జనసేన రెండూ సమానమే. కానీ బీజేపీ కాస్త ఎక్కువ సమానం అనుకోవాలేమో.