మోడీ పాలనలో భారతదేశం వెలిగిపోతుందని బీజేపీ ఊదరగొడుతోంది. గత ఏడేళ్లుగా మోడీ సారథ్యంలో దేశం నడుస్తోంది. అయితే అది ముందుకా. వెనక్కా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. మన దేశ పరంగా చూస్తే చీకట్లోకి వెళ్లిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీ పరంగా మాత్రం ఆదాయాలను పెంచుకుంటూ వెలిగిపోతోంది. గత ఏడేళ్ల మోడీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతి ఇదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
పార్లమెంట్ వేదికగా మన దేశం అప్పు ఎంతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న వెల్లడించారు. ఇదే సందర్భంలో తమ పార్టీ ఆదాయ వ్యయాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ తాజాగా సమర్పించింది. ఈ రెండింటిని పరిశీలిస్తే మోడీ పాలన వల్ల ఆదాయం ఎవరికి? అప్పులెవరికి సమకూరాయో అర్థమవుతుంది.
కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పు ఎంత అని లోక్‌సభలో ఎంపీ సజ్జా అహ్మద్ ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా… రూ. 119,53,758 కోట్ల అప్పు ఉందని సమాధానం ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎఫైర్స్, ఆర్బీఐ వెబ్‌సైట్‌లలోని వివరాల ప్రకారం 2014, మార్చి 31వ తేదీ నుంచి గత నెల జూలై 31వరకూ కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 74.74 లక్షల కోట్లు. స్వాతంత్ర్యం వచ్చిన మొదలు 2014, మార్చి 31వ తేదీ వరకూ భారతదేశ అప్పు రూ.46 లక్షల 25 వేల 37 కోట్లు. కానీ మోడీ పాలనలో కేవలం ఏడేళ్లలో కనీవినీ ఎరుగని అప్పులు దేనికి సంకేతం?
ఇక ఎన్నికల సంఘానికి బీజేపీ సమర్పించిన లెక్కల వివరాలను కూడా తెలుసుకుని మురిసిపోదాం. 2019-20 సంవత్సరానికి గానూ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ రూ.5,611.14 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే రూ.2,100.73 కోట్లు ఖర్చు చేసింది. బీజేపీకి అత్యధికంగా బాండ్ల రూపంలో రూ.2555 కోట్లు వచ్చింది. ఆజీవన్ సహయోగ్ నిధి నుంచి రూ.23.05 కోట్లు వచ్చింది. పార్టీ ప్రచారం, ప్రకటనలకు రూ.303.30 కోట్లు, అభ్యర్థులకు ధన సహాయంగా రూ.199.11 కోట్లు ఖర్చు చేసింది.
ఒకవైపు కేంద్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీని ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు ఇదే అధికారంతో దేశాన్ని దివాళా తీసేలా ఇబ్బడిముబ్బడిగా బీజేపీ సర్కార్ అప్పులు చేస్తోంది. మోడీ సర్కార్ పాలన పుణ్యమా అని బీజేపీ ఆదాయంతో వెలిగిపోతుంటే, భారతదేశం మాత్రం అప్పులతో చీకట్లోకి పయనిస్తోంది. ఇదండీ దేశ భక్తి పార్టీ పాలనా ఘనత.