వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను బీజేపీ సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. తెలంగాణలో ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ మాత్రం బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదే బద్వేలు విషయానికి వస్తే మాత్రం మొక్కుబడిగా పోటీకి దిగింది. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, బద్వేలులో పనతల సురేష్ బీజేపీ తరపున బరిలో నిలిచారు.
హుజూరాబాద్‌తో పోల్చితే బద్వేలును అసలు లెక్కలోకి కూడా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి కేంద్రహోంమంత్రి అమిత్‌షాను తీసుకొచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. ఇదే బద్వేలుకు మాత్రం ఏ ఒక్క ముఖ్య నాయకుడు ప్రచారానికి వెళ్లడం లేదు. దీన్ని బట్టి బీజేపీ దృష్టిలో బద్వేలు అనేది కౌంట్‌లో లేనట్టు అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంది. దీంతో అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి వరకూ డ్రామా నడిచింది. జనసేనాని పవన్‌కల్యాణ్ అకస్మాత్తుగా తాను బరి నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి బీజేపీకి షాక్ ఇచ్చారు. చివరికి తామే నిలబడాల్సి వచ్చినట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన విజయంతో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఏపీలో మాత్రం 2024లో అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కనడమే తప్ప, సాకారం చేసుకునే ప్రయత్నాలేవీ కనిపించడం లేదు. మరోవైపు జనసేనతో పొత్తు ఉందో లేదో తెలియని అయోమయం. ఇది బద్వేలు ఉప ఎన్నికలో మరింత స్పష్టమవుతోంది.