ఇటీవల రాష్ట్ర, జాతీయస్థాయి బీజేపీ నేతలు పదేపదే చెబుతున్న మాట…2024లో జనసేనతో కలిసి ఏపీలో అధికారంలోకి వస్తామని. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెబుతున్నారు. విజయవాడ రమేశ్ ఆస్పత్రి కోవిడ్ సెం టర్‌లో అగ్ని ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు బాధితులను పరామర్శించేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోలేదని, తమ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రమే వెళ్లారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడిన కొన్ని అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తే…బీజేపీ వ్యూహం ఏంటో తెలుస్తుంది.
‘రాష్ట్రంలో 2024లో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. దానిని బీజేపీ భర్తీ చేయాలి’ అని రామ్‌మాధవ్ అన్నారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. 23 సీట్లతో అసెంబ్లీలో అడుగు పెట్టింది. ఆ పార్టీకి బలమైన కార్యకర్తల బలం ఉంది. అంతకు మించి శ్రేణుల్ని ఏకతాటిపైకి తెచ్చే నెట్‌వర్క్ టీడీపీ సొంతం. కానీ ఏపీలో ప్రతిపక్ష పార్టీ స్థానం ఖాళీగా ఉందని రామ్ మాధవ్ మొదలుకుని బీజేపీ దిగువ స్థాయి నాయకుల వరకు పదేపదే మాట్లాడుతున్నారంటే విడ్డూరంగా, విచిత్రంగా ఉంటుంది. కానీ ఇక్కడే బీజేపీ అసలు వ్యూహం దాగి ఉంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన బీజేపీ ఇలా మాట్లాడుతుందేమిటని ఆశ్చర్యం కలగవచ్చు. ప్రత్యర్థులకు వారి మాటలు అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ బీజేపీ హిప్నాటిజం అనే సైన్స్ సాంకేతిక విద్యను ఏపీ రాజకీ యాల్లో అమలు చేయబోతోంది.
హిప్నాటిజం అంటే వశపరచుకునే విద్య. మాటలతో ఎదుటి వారి మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే హిప్నాటిజం ప్రధాన లక్ష్యం, లక్షణం. రాజకీయ భవిష్యత్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని ఆ పార్టీ శ్రేణులకు నమ్మకం, భరోసా పోయేలా, ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చేయడమే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందనడం, దాన్ని తాము భర్తీ చేస్తామనడం, 2024లో మిత్రపక్షంతో కలిసి అధికారంలోకి వస్తామని పదేపదే బీజేపీ నేతలు చెప్పడం…టీడీపీని మానసికంగా దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే చూడాలి.
బీజేపీ ఎత్తుగడలు మొదట్లో ఏమీ లేనట్టే కనిపిస్తాయి. ఆ ఎత్తుగడల అసలు లక్ష్యాలేంటో దెబ్బతిన్న తర్వాత గానీ ప్రత్యర్థులకు అర్థం కావు. ఉదాహరణకు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని సోము వీర్రాజు స్వయంగా కలుసుకున్నారు. పైకి మాత్రం ఇద్దరి కలయిక మర్యాదపూర్వకంగా అని చెప్పినప్పటికీ…ఈ కలయిక కాపు సామాజిక వర్గానికి ఒక సంకేతాన్ని పంపగలిగింది. కాపులంతా ఒక్క తాటిపైకి వస్తున్నారని, రావాలనే రెండు సందేశాలను ఒకే ఒక్క కలయిక ద్వారా సోము వీర్రాజు పంపగలిగారు.
చిరంజీవి తర్వాత పవన్‌కల్యాణ్, ఆ తర్వాత ముద్రగడ, సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మినారాయణ లాంటి వాళ్లను కలవ నున్నట్టు సోము వీర్రాజు ప్రకటించడం వెనుక కేవలం 'మర్యాద' మాత్రమే ఉందనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి లేదు. ఊరికనే కలవరు మహానుభావులు అన్నట్టు…రాజకీయ నేతల కలయికకు అర్థాలే వేరు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అనే లెక్కన రాజకీయ నేతల సమీకరణలు ఉంటాయి.
బీజేపీ నేతల ప్రతి మాట, ప్రతి కలయిక వెనుక హిప్నాటిజం థియరీ దాగి ఉంది. హిప్నాటిజం ద్వారా మనసుతో పాటు శరీరంపై వారికి నియంత్రణ కోల్పోయేట్టు చేస్తారు. నిద్రావస్థలోకి వెళ్లి, తనపై తాను నియంత్రణ కోల్పోయిన వ్యక్తి హిప్నాటిస్ట్ ఏం చేయ మంటే అది చేస్తాడు.
ఈ టెక్నిక్‌ను ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఇప్పటికే స్టార్ట్ చేసింది. అందులోనూ బీజేపీలో నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేని దుస్థితిలో ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీలున్నాయి. ప్రధానంగా అధికార వైసీపీ ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వైపు మరలే అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీకి మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు వెన్నుదన్నుగా ఉన్నారు. రెడ్లతో పాటు ఇటీవల బీసీలు కూడా వైసీపీకి అండగా ఉంటున్నారు.
టీడీపీ విషయానికి వస్తే బీసీల్లో సగం, కాపులు, కమ్మ సామాజిక వర్గాలు మొదటి నుండి అండగా ఉంటున్నాయి. అందువల్ల కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు, మిత్రపక్షమైన జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా అదే సామాజిక వర్గం కావ డంతో…ముందుగా కాపులను తమ వైపు తిప్పుకునే వ్యూహ రచన చేస్తున్నారు. టీడీపీ రాజకీయ సమాధిపై తన పునాదులను ఏర్పరచుకోవాలనే వ్యూహంలో భాగంగా బీజేపీ చురుగ్గా పావులు కదుపుతోందన్నది నిజం. దీనికి చంద్రబాబు నిస్సహాయత, ఒకప్పటిలా బలంగా పోరాడే శక్తి కోల్పోవడం బీజేపీకి కలిసి వస్తోంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఎందుకు విమర్శి స్తున్నారనే మీడియా ప్రశ్నలకు 'మీకెందుకు బాధ' అని బీజేపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
తమ ఓటు బ్యాంకు టీడీపీలోనే ఉందని గ్రహించడం వల్లే…ముందు ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు బీజేపీ అస్త్రశస్త్రాలను సంధి స్తోంది. మున్ముందు పెద్ద ఎత్తున టీడీపీ నుంచి తమ పార్టీలోకి వలసలు ఉంటాయని ఇటీవల సోము వీర్రాజు ప్రకటించారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని మార్క్సిస్ట్ మహానుభావులు అన్నారు. కానీ పోరాటానికి బదులు లొంగుబాటు ధోరణిలో వ్యవహరిస్తుండడం వల్లే టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమై బీజేపీ బలోపేతానికి దారి తీస్తుందని అనుమానాలు తలెత్తుతున్నాయి. త్రిపుర, పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో బీజేపీ బలపడడాన్ని చూస్తే…ఏపీలో ఆ పార్టీ కల నెరవేరదని చెప్పడానికి వీల్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.