తెలుగుదేశం అంటే రఘురామకృష్ణంరాజుకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీపై మోజును మరో రాజు గారు ప్రదర్శించడం చర్చకు దారి తీసింది.
టీడీపీపై తన ఇష్టాన్ని, వైసీపీపై ద్వేషాన్ని చాటుకునేందుకు సదరు రాజుగారికి సమయం వచ్చింది. దీంతో ఏ మాత్రం దాచుకోకుండా పార్టీ విధానానికి వ్యతిరేకంగా నగ్నంగా తన ప్రేమను ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనే మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు.
విశాఖ జిల్లా బీజేపీలో ముఖ్య నేత. పేరుకే బీజేపీనే కానీ, మనసంతా టీడీపీనే. బీజేపీలో కొనసాగుతూ టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తారనే పేరు ఆయన సొంతం. టీడీపీతో స్నేహమంటే బీజేపీ పారిపోతుండడం చూస్తున్నాం. అదేంటోగానీ, ఈయన గారు మాత్రం టీడీపీకి మద్దతు ప్రకటించి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 31వ వార్డు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి తన పార్టీ మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒకవైపు టీడీపీతో పొత్తు ప్రశ్నే లేదని, ఆ పార్టీకి చెందిన సోము వీర్రాజు, సునీల్ దియోధర్ , జీవీఎల్ తదితర నాయకులు బల్ల గుద్ది చెబుతుంటే… విష్ణుకుమార్ రాజు మాత్రం మీసం మెలేస్తూ పొత్తు ఉందని చేసి చూపారు.
మరి పార్టీ విధానపరమైన నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీకి మద్దతు ప్రకటించిన విష్ణుకుమార్‌రాజుపై చర్య తీసుకునే దమ్ము ఏపీ బీజేపీ పెద్దలకు ఉందా?