క‌ర్ణాట‌క‌కు కొత్త సీఎం.. బీజేపీకి గిట్టుబాట‌య్యే అంశ‌మేనా?

బీజేపీ నేత బీఎస్‌ యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి సోమవారం రెండేళ్లు నిండుతున్న శుభ సమయంలోనే పదవీగండం ఉందని, ఈ లింగాయత్‌ నేత స్థానంలో కొత్త నేత వస్తాడని పది రోజులుగా మీడియా…

బీజేపీ నేత బీఎస్‌ యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి సోమవారం రెండేళ్లు నిండుతున్న శుభ సమయంలోనే పదవీగండం ఉందని, ఈ లింగాయత్‌ నేత స్థానంలో కొత్త నేత వస్తాడని పది రోజులుగా మీడియా నిండా వార్తలే. ఈ విషయంపై ఇంగ్లిష్‌ దినపత్రిక హిందూస్తాన్‌ టైమ్స్‌ వెబ్‌సైట్‌లో ఆదివారం మధ్యాహ్నం వెల్లడించిన వార్తలో 78 ఏళ్ల వృద్ధ నేతకు వారసునిగా ఎంపికవడానికి అవకాశమున్న ఐదుగురు నేతల గురించి క్లుప్తంగా వివరించారు. వారిలో యడియూరప్ప కులానికి చెందిన నేతలూ, ఇతర వర్గాలకు చెందిన నాయకులూ (వారిలో ఇద్దరు బ్రాహ్మణులు- ప్రహ్లాద జోషీ, బీఎల్ సంతోష్) ఉన్నారు. 

రామకృష్ణ హెగ్డే 1988లో రాజీనామా చేశాక, కర్ణాటకలో బ్రాహ్మణ ముఖ్యమంత్రి ఎవరూ అధికారంలోకి రాలేదనే మాటతో ఈ రాజకీయ వార్తను ముగించారు. నిజమే, యూపీ, బిహార్‌ సహా 9 హిందీ రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పుడు బ్రాహ్మణ ముఖ్యమంత్రి లేడు. అంటే, నిన్న మొన్నటి వరకూ (1980ల చివరి వరకూ) నెహ్రూ, వాజ్‌పేయి కులానికి చెందిన సీఎంలే ఈ ఆర్యావర్త రాష్ట్రాల్లో రాజ్యమేలారు. 

జనాభారీత్యా బాగా తక్కువ జనసంఖ్య (రెండు నుంచి మూడు శాతం) ఉన్న దక్షిణాదిలో బ్రాహ్మణ సీఎంల పాలనకు కాలం చెల్లి దాదాపు 33 ఏళ్లు దాటాయి. అయితే, ఇక్కడో విశేషం చెప్పాలి. 2016 డిసెంబర్‌ 5న కన్నుమూసే వరకూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితా జయరామ్‌ను దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రానికి చివరి బ్రాహ్మణ సీఎంగా పరిగణించేవారూ ఉన్నారు.

బ్రాహ్మణ వ్యతిరేకతే పునాదిగా పుట్టిన ద్రవిడ ఉద్యమం మూలాలున్న ఏఐఏడీఎంకే సీఎం అయినాగాని తమిళ బ్రాహ్మలు ఆమెను తమ జాతి బిడ్డగానే పరిగణించి అభిమానించారు. అయితే, ఆమె బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం అనేది జయకు అనుకూలాంశమూ కాదు, ప్రతికూల విషయమూ కాదు. సామాన్య ప్రజానీకం ఆమెను పేదల పెన్నిధి ఎంజీఆర్‌ వారసురాలు, ఆయన మాజీ హిరోయిన్‌గా చూశారేగాని శ్రీవైష్ణవ బ్రాహ్మణ స్త్రీగా చూడలేదు. ఆమె పుట్టుకే ప్రమాణం అనుకుంటే జయలలితే దక్షిణాదిన చివరి బ్రాహ్మణ సీఎం. 

ఆమెకు ముందు, తమిళనాట బ్రాహ్మణ సీఎం ఎవరంటే, ఎంజీఆర్‌ భార్య వీఎన్‌ జానకి. భర్త మరణించిన రెండు వారాలకు ఆమె 1988 జనవరి 7న సీఎం పదవి చేపట్టి నెల తిరగకుండానే పదవీచ్యుతులయ్యారు. ఆమెకు ముందు మద్రాసు (1969 వరకూ ఉన్న పేరు) రాష్ట్రంలో స్వాతంత్య్రం వచ్చాక మొదటి బ్రాహ్మణ సీఎం చక్రవర్తి రాజగోపాలాచారి. 

ఆయన 1954లో రాజీనామా చేశాక సీఎం పదవి చేపట్టిన కాంగ్రెస్‌ సీఎంలు ఇద్దరూ (కె.కామరాజ్‌ నాడార్, ఎం.భక్తవత్సలం) బ్రాహ్మణేతరులే. వారి తర్వాత 1967 ఎన్నికల్లో ఓడిపోయాక కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రాలేదు. కనీసం పాలకపక్షం (డీఎంకే అయినా ఏఐడీఎంకే అయినా) మిత్రపక్షంగా ఉండికూడా అధికారంలో స్వల్ప వాటా (మంత్రి పదవులు) కూడా సంపాదించలేదు. 

మిగిలిన దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే–అప్పటి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్‌ రాష్టాల తొలి సీఎంలు వరుసగా టంగుటూరి ప్రకాశం, బూర్గుల (అసలు ఇంటిపేరు పుల్లంరాజు–నియోగి) రామకృష్ణారావు ఇద్దరూ బ్రాహ్మణులే. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా కొత్త అవతారమెత్తిన 15 ఏళ్ల తర్వాత తొలి బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు కాంగ్రెస్‌ తరఫున రావడం నిజంగా ఊహించని పరిణామం. అనుకున్నట్టే, ఏడాదిన్నర కూడా నిండకుండానే పీవీ పదవికి రాజీనామా చేసి ఇంటిముఖం పట్టారు.

సాత్వికుడు, బుద్ధిజీవి, భాషాకోవిదుడు, సాటి బ్రాహ్మణుడిని రెడ్ల రాజకీయాధిపత్యం తిరుగులేని స్థితిలో ఉన్న కాలంలో నియమించిన ఇందిర దక్షిణాదిన తొలి రాజకీయ పొరపాటు చేశారు. ఏపీలో దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన తర్వాత వరుసగా వచ్చిన ఐదుగురు సీఎంలలో ఒక్కరూ బ్రాహ్మణడు కాదు. 1989–94 మధ్య మూడేళ్లు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న దుద్దిళ్ల శ్రీపాదరావు మినహా సీఎం పదవి ఆశించే స్థాయి ఉన్న బ్రాహ్మణ కాంగ్రెస్‌ నేతలు ఎవరూ అవతరించలేదు. శ్రీపాదరావు సైతం అప్పట్లో ఆయన ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్‌ జిల్లా మంథనికి గతంలో అసెంబ్లీలో నాలుగుసార్లు ప్రతినిధి, ఆయన కులానికే చెందిన పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగానే స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 

2009లో పదవిలోని సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కన్నుమూశాక ఆ పదవి ఆశించే స్థాయిలో బ్రాహ్మణ కాంగ్రెస్‌ నేత ఎవరూ లేరు. అంతేకాదు, అసెంబ్లీలో సైతం ఈ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య కేవలం ఐదు లోపే ఉండడం తెలుగునాట ‘రాజకీయ విప్లవం’(1982 తెలుగుదేశం ఆవిర్భావం, 1983లో విజయం) వచ్చినప్పటి నుంచీ ఆనవాయితీగా కొనసాగుతోంది. తెలుగునాడు ఇప్పుడు రెండు రాష్ట్రాలయ్యాక కూడా ఇద్దరిద్దరు చొప్పున మొత్తం నలుగురు బ్రాహ్మణులే తెలుగు శాసనసభల్లో కూర్చుని ఉన్నారు. రెండు చోట్లా బ్రాహ్మణ మంత్రులెవరూ లేరు. ఏపీలోఉన్న ఇద్దరిలో ఒకరు అసెంబ్లీ ఉపసభాపతి పదవిలో ఉండగా, రెండో ఎమ్మెల్యే ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌. ఏపీలో కేవలం ఇద్దరే గెలవడంతో బ్రాహ్మణులకు జరిగిన మేలు ఇది. 

ఇక దక్షిణాదిన ఒకప్పటి అతి చిన్న రాష్ట్రం, ఇప్పటి నాలుగో పెద్ద రాష్ట్రం (జనాభాలో కాదు ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యలో–20, 140) కేరళలో రాష్ట్ర ఆవిర్భావం (1956 నవంబర్‌ 1) నుంచి ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి పదవి సాధించిన నేతల్లో – కమ్యూనిస్ట్‌ అగ్రనేత ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ఒక్కరే బ్రాహ్మణుడు. నాస్తికుడైన ఈఎంఎస్‌కు దేవుడు లేడు కాని కులం ఉంది. 

హిందూ మతాన్ని పునరుద్ధరించిన మహానుభావుడిగా పేరొందిన శంకరాచార్యుడి సామాజికవర్గం–నంబూద్రి బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగా బ్రాహ్మణ సీఎంల జాబితాలో ఆయనను చేర్చక తప్పలేదు. ఆయన 1957లో మొదటిసారి, 1967లో రెండోసారి కమ్యూనిస్టుగా సీఎంగా పీఠమెక్కినా మొత్తం కలిపి దాదాపు ఐదేళ్లే పదవిలో కొనసాగారు. మొదటిసారి 1959లో తెలుగు కాంగ్రెస్‌ బ్రాహ్మణుడు బూర్గుల రామకృష్ణారావు గవర్నర్‌గా ఉండగా ఈఎంఎస్‌ సర్కారును అప్పటి నెహ్రూ ప్రభుత్వం అన్యాయంగా బర్తరఫ్‌ చేసింది. రెండోసారి 1969లో ఉభయ కమ్యూనిస్టుల మధ్య విభేదాలు నంబూద్రిపాద్‌ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయ్యాయి. 

ప్రస్తుత విషయం–కర్ణాటక సంగతి చూస్తే, పూర్వపు ఉమ్మడి ఏపీ, ఇప్పటి కేరళతోపాటే 1956 నవబంబర్‌ ఒకటిన ఆవిర్భవించిన ఈ రాష్ట్రంలో గత 65 ఏళ్లలో ఇద్దరే బ్రాహ్మణ నేతలు (కాంగ్రెస్‌ మూలాలున్న ఆర్‌.గుండూరావు, రామకృష్ణ హెగ్డే) ముఖ్యమంత్రులుగా దాదాపు ఎనిమిదిన్నరేళ్లు పనిచేశారు. రాష్ట్ర అవతరణ నుంచి ఇప్పటి వరకూ 19 మంది ముఖ్యమంత్రులుగా ఉండగా కేరళ, ఏపీ, మాదిరిగానే ఈ ఇద్దరు బ్రాహ్మణ సీఎంలలో (గుండూరావు, హెగ్డే) హెగ్డే ఒక్కరే రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేసినా, ఏ ఒక్కరూ ఐదేళ్లు వరుసగా ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగలేదు. 

ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగానే కర్ణాటకలో కూడా బ్రాహ్మణ జనాభా రెండు శాతమేగాని మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పోల్చితే బ్రాహ్మణ ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం ఇక్కడ ఎక్కువే. కేవలం 2–3 శాతం జనాభాతో ఇంత మంది ఎమ్మెల్యేలు గెలవడం ఈ దక్షిణాది రాష్ట్రం విశిష్ఠతే. బీజేపీ తరఫున 10 మంది, కాంగ్రెస్‌ టికెట్‌పై నలుగురు బ్రాహ్మణులు ప్రస్తుత అసెంబ్లీకి 2018లో ఎన్నికయ్యారు. పైన చెప్పినట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుగురు బ్రాహ్మణులు 2018 డిసెంబర్, 2019 మేలో ఎన్నికవడం తెలుగునాట ఈ సామాజికవర్గం రాజకీయ స్థితిగతులకు అద్దంపడుతోంది. అలాగే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ టికెట్‌పై ఎన్నికయ్యారు. 

ఉత్తర కన్నడ నుంచి అనంత్‌ హెగ్డే, దక్షిణ బెంగళూరు నుంచి తేజస్వీ సూర్య గెలిచారు. ధార్వాడ్‌ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఎన్నికయ్యారు. ఒక దక్షిణాది రాష్ట్రం నుంచి ముగ్గురు గెలవడం కర్ణాటకలో మాత్రమే సాధ్యమైంది. అయితే, అగ్రవర్ణమైన బ్రాహ్మణుల అభివృద్ధికి ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన తొలి సీఎం నారా చంద్రబాబునాయుడు. ఆయన చివరిసారి సీఎం అయిన 2014లోనే బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం, దానికి చైర్మన్‌గా రిటైర్డ్‌ ఏపీ చీఫ్‌ సెక్రెటరీ ఐవైఆర్‌ కృష్ణారావుని నియమించడం నిజంగా సంచలనమే. దేశంలోనే ఇది తొలి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌గా చరిత్రకెక్కింది. ఇది వైఎస్సార్సీపీ విజయవాడ ఎమ్మెల్యే(వైదిక బ్రాహ్మణ) మల్లాది విష్ణు నాయకత్వాన ఇంకా కొనసాగుతోంది. 

మళ్లీ కర్ణాటక విషయానికి వస్తే, కర్ణాటక రాష్ట్ర బ్రాహ్మణ అభివృద్ధి బోర్డును ఏడాది క్రితం ప్రస్తుత సీఎం యడియూరప్ప ఏర్పాటుచేశారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ హామీ ఇచ్చింది జేడీ–ఎస్‌ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం అయ్యాక బడ్జెట్‌ ప్రసంగంలో ఈ బ్రాహ్మణ బోర్డు ఏర్పాటు చేస్తానని, అందుకోసం పాతిక కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కాని, వాస్తవానికి దీని ఏర్పాటు చివరికి ఎక్కువ మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలున్న (10) బీజేపీ సర్కారు 2020 జులైలో ఈ పని చేసింది. 

ఈ బోర్డు ఈ ఏడాది ఆరంభంలో రెండు బ్రాహ్మణ సంక్షేమ పథకాల్లో కాస్త వింతగా కనిపించేది–మైత్రేయి పథకం. ఈ పథకం కింద పేద కుటుంబాలకు చెందిన పురోహితులు లేదా పూజారి వృత్తిలో ఉన్న బ్రాహ్మణ యువకులను పెళ్లాడడానిక ముందుకొచ్చే పాతిక మంది మహిళలకు ఉచితంగా రూ.3 లక్షల చొప్పున డబ్బు ఇస్తారు. వారికి ఇది మొదటి పెళ్లయి ఉండాలి. 

అయితే పెళ్లి చేసుకున్న ఈ బ్రాహ్మణ దంపతులు విధిగా మూడేళ్లు కలిసి కాపురం చేస్తే, వివాహమైన తర్వాత ప్రతి ఏడాది చివర్లో లక్ష రూపాయల చొప్పున వరుసగా మూడేళ్లు ఇస్తారు. ఈ పథకం అమలు కోసం రూ.3 లక్షల విలువైన బాండ్లు ప్రతి జంట పేరున నమోదు చేస్తారు. విద్యలో మొదట్నించీ ముందున్న బ్రాహ్మణ సమాజంలో గత పదిహేనేళ్లుగా ఆలయ పూజారులుగా, పౌరోహిత్యం చేసే బ్రాహ్మణ యువకులకు పిల్లనివ్వడానికి బ్రాహ్మణులు ఇష్టపడకపోవడం అనేది అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో పెద్ద సమస్యగా ఉంది. 

కాని జనాభా పెద్దగా లేకున్నా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలు, పౌర సమాజంలో ఇంకా గౌరవ మర్యాదలు ఓ మోస్తరుగా పొందుతున్న కర్ణాటక బ్రాహ్మణులు మాత్రమే ఇలాంటి మైత్రేయి పథకం సాధించగలిగారు. ఏపీ మాదిరిగానే రాజకీయాధికారం కోసం తీవ్రంగా పోటీపడే రెండు కులాలున్న (లింగాయత్, వక్కళిగ) ఈ దక్షిణాది రాష్ట్రంలో 1985 తర్వాత(అప్పుడు చివరిసారిగా రామకృష్ణ హెగ్డే) బెంగళూరులో ఒక బ్రాహ్మణ నేత సీఎంగా ప్రమాణం చేస్తే నిజంగా సంచలనమే.

అయితే, మహారాష్ట్ర జనాభాలో మూడు నాలుగు శాతం మించని బ్రాహ్మణ వర్గానికి చెందిన దేవేంద్ర ఫడణవీస్‌ను 2015లో గద్డెనెక్కించిన నరేంద్రమోదీ–అమిత్‌షా ద్వయం 2021లో కర్ణాటకలో అంతటి సాహసానికి ఒడిగట్టి బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ (వాస్తవానికి ధార్వాడ్‌ ప్రాంతానికి చెందిన జోషీది మరాఠీ మాతృభాష) లేదా బీఎల్‌ సంతోష్ (ఆరెసెస్‌ నేపథ్యం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి-సంస్థాగత వ్యవహారాలు)లలో ఒకరికి ఇస్తుందా? 

ఈ పోస్ట్‌ రాయడం పూర్తి చేసే సమయానికి యడియూరప్ప వారసునిగా బీఎల్ సంతోష్ పేరును సీఎం పదవికి  కాషాయపక్షం కేంద్ర నాయకత్వం ఖరారు చేసే యోచనలో ఉన్నట్టు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. మరి, కర్ణాటకానికి మూడో బ్రాహ్మణ సీఎం  కాషాయపక్షం తరఫున అధికారం చేపట్టడం ఎంత వరకు నిజమౌతుందో!

– నాంచార‌య్య మెరుగుమాల‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్