నటి కంగనా రనౌత్ కు ఊరట లభించింది. మతాల మధ్యన విద్వేషాలను రేకెత్తించేలా ట్వీట్ చేసిన ఆమెపై ముంబై పోలీసులు నమోదు చేసిన కేసుల విషయంలో ఊరట లభించింది. ఆమెపై పెట్టిన సెక్షన్లను ముంబై హై కోర్టు తప్పు పట్టింది.
ఆమెపై ఆ సెక్షన్లను పెట్టడం సబబు కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సెక్షన్లను అప్లై చేయాలో కాస్త తెలుసుకోవాలని ముంబై పోలీసులకు హై కోర్టు క్లాస్ పీకింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయంలో పోలీసులను గైడ్ చేయాలని సూచించింది.
అయితే పోలీసుల విచారణకు కంగనా హాజరు కావాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. దానికి వచ్చే ఏడాది జనవరి ఎనిమిది వరకూ గడువునిచ్చింది. ఈ నేపథ్యంలో కంగనాపై తదుపరి చర్యలన్నీ ఆగిపోయినట్టే! బహుశా ఇన్నాళ్లూ ముంబైలో అడుగుపెట్టడానికి సంశయించిన కంగనా.. ఇక దర్జాగా ముంబైకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో కంగనా ముంబై వెళితే ఆమె ఏ రేంజ్ లో హంగామా చేస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం!
ఇక కంగనా కేసులో తాము ఇచ్చిన తీర్పుపై సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ముంబై హై కోర్టు స్పష్టం చేసింది. తమ తీర్పుపై సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తూ స్పందించవద్దు అని తేల్చి చెప్పింది.
ఇటీవల న్యాయస్థానాల తీర్పులపై సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలు సంచలనంగా మారుతున్నాయి. అసలు కేసులను ఈ కొసరు కేసులు మరింత చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ తీర్పుపై సోషల్ మీడియాలో ఎవరూ స్పందించవద్దు అని ముంబై హై కోర్టు ముందే స్పష్టంగా చెప్పింది!