ఇటు హైకోర్టు, అటు ప్రభుత్వం మధ్య అమరావతి రాజధాని తీవ్ర చర్చకు కేంద్రమైంది. కౌంటర్, ఎన్‌కౌంటర్ అన్న రీతిలో రాజధానిపై వైరి పక్షాల వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఎవరికీ ఎవరూ తగ్గడం లేదు. ముఖ్యంగా పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసలు తగ్గట్లేదు.
విశాఖకు పాలనా రాజధాని తరలించడాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన మరోసారి కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పారు. కేవలం కొన్ని సాంకేతిక కారణాల వల్లే విశాఖకు పాలనా రాజధాని తరలించకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. చివరకు న్యాయస్థానం అంగీకరిస్తుందనే నమ్మకాన్ని ఆయన వెల్లడించడం గమనార్హం.
మీడియాతో ఆయన మాట్లాడుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఒక యాత్ర జరుగుతోందని పరోక్షంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర గురించి ప్రస్తావించారు. అందులో అంతా పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నారని ఎద్దేవా చేశారు. యాత్ర ఏ విధంగా జరుగుతోందో వాళ్లు మీడియాతో ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం అని చెప్పుకొచ్చారు.
ఒకవైపు మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దుపై హైకోర్టులో విచారణ… ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటే, మరోవైపు మంత్రులు, సలహాదారు అందుకు దీటుగా కౌంటర్లు ఇస్తుండడం ఆసక్తి పరిణామంగా భావించొచ్చు. అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందనే ఆశను హైకోర్టు వ్యాఖ్యలు కలిగిస్తుంటే లేదులేదు ఎట్టి పరిస్థితుల్లోనే తరలిపోతుందనే నిరాశను ప్రభుత్వ తరపు పెద్దల మాటలు నింపుతున్నాయి. హైకోర్టు, ప్రభుత్వం రెండు వైపుల నుంచి అమరావతి రాజధానిపై విభిన్న ఘాటు వ్యాఖ్యలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుండడం గమనార్హం.
అమరావతి ఉద్యమాన్ని స్వాతంత్ర్య సమరంతో రాజ్యాంగ వ్యవస్థ పోల్చితే, బొత్స మాత్రం పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చడం ఆయనకే చెల్లింది. రానున్న రోజుల్లో ఈ ధోరణులు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చర్యకు ప్రతి చర్య వుంటుందని న్యూటన్ మహాశయుడు ఏనాడో చెప్పారో కదా!