దేశ పొలిటిక‌ల్ మూడ్ ను చెప్ప‌నున్న ఉప ఎన్నిక‌లు!

ఈ రోజు దేశ‌వ్యాప్తంగా ముప్పై అసెంబ్లీ సీట్ల‌లో, మూడు లోక్ స‌భ సీట్ల‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దేశంలోని విభిన్న రాష్ట్రాల్లో, విభిన్న ప్రాంతాల్లో, విభిన్న పార్టీల మ‌ధ్య‌న పోరులా సాగుతున్న ఈ ఉప…

ఈ రోజు దేశ‌వ్యాప్తంగా ముప్పై అసెంబ్లీ సీట్ల‌లో, మూడు లోక్ స‌భ సీట్ల‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దేశంలోని విభిన్న రాష్ట్రాల్లో, విభిన్న ప్రాంతాల్లో, విభిన్న పార్టీల మ‌ధ్య‌న పోరులా సాగుతున్న ఈ ఉప ఎన్నిక‌లు దేశంలోని పొలిటిక‌ల్ మూడ్ ను ఎంతో కొంత తెలియ‌జేయ‌నున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య‌న ఎక్క‌డిక్క‌డ ఈ పోరు జ‌రుగుతూ ఉంది.

ఆయా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వ ప‌నితీరు మీద ఈ ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జాతీర్పు రానుంది. వీటిల్లో కొన్ని చోట్ల ప్ర‌తిప‌క్ష పార్టీలు గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. పోరాడుతున్నాయి. బిహార్ లో రెండు అసెంబ్లీ సీట్ల‌కు ఉప ఎన్నిక పోలింగ్ సాగుతూ ఉంది. అక్క‌డ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గట్టి పోటీని ఇచ్చిన ఆర్జేడీ ఈ ఉప ఎన్నిక‌లో సీట్ల‌ను నెగ్గి త‌న స‌త్తాను చాటాల‌నే ధ్యేయంతో ఉంది. నితీష్ కుమార్ ప్ర‌భుత్వానికి  గ‌ట్టి షాకే అవుతుంది ఆర్జేడీ గ‌నుక ఉప ఎన్నిక‌ల్లో నెగ్గితే.

ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ లో తిరుగుబాటును ఆధారంగా చేసుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి అక్క‌డ ఉప ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల్సిన అవ‌స‌రం ఉంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి తాము అధికారాన్ని చేజిక్కించుకున్న చోట‌.. ప్ర‌జ‌లు త‌మ‌కు ఏ మేర‌కు అనుకూలంగా ఉన్నారో ఎంపీలోని బీజేపీ ప్ర‌భుత్వం తెలియ‌జేయాల్సి ఉంది, ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం ద్వారా.

అలాగే క‌ర్ణాట‌క‌లోనూ రెండు అసెంబ్లీ సీట్ల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ ఇటీవ‌లే బీజేపీ వాళ్లు కొత్త ముఖ్య‌మంత్రిని నియ‌మించారు. ఇటీవ‌లి కాలంలో క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి పోటీనే ఇచ్చింది. ఇలాంటి నేప‌థ్యంలో ఈ సారి అక్క‌డ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆస‌క్తిదాయ‌కంగా మారాయి.

ఇంకా అస్సాంలో ఐదు అసెంబ్లీ సీట్ల‌కు, వెస్ట్ బెంగాల్ లో నాలుగు అసెంబ్లీ సీట్ల‌కు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మూడు అసెంబ్లీ సీట్ల‌కు, మేఘాల‌యాలో మ‌రో మూడు సీట్ల‌కు, రాజ‌స్తాన్ లో రెండు అసెంబ్లీ సీట్ల‌కు, ఏపీ, హ‌ర్యానా, మ‌హారాష్ట్ర‌, మిజోరాం, నాగాలాండ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ సీటుకు నేడు ఉప ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతూ ఉంది. 

మొత్తంగా ముప్పై అసెంబ్లీ సీట్ల‌కు, మూడు లోక్ స‌భ సీట్ల‌కు అంటే.. ఒక బుల్లి రాష్ట్రం ఎన్నిక‌లంతా పరిమాణం ఇది. అది కూడా దేశం న‌లుమూలల్లో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లు కావ‌డంతో వీటి ఫ‌లితాలు దేశ పొలిటిక‌ల్ మూడ్ ను తెలియ‌జేయ‌నున్నాయి.