అమరావతి రాజధానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. గత నెల 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ఆలోచనను వెల్లడించినప్పటి నుంచి ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. మూడు రాజధానుల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. సీఎం జగన్ మాత్రం ఎక్కడా నోరు తెరవడం లేదు. ఆరోగ్యశ్రీ పథకం ఫైలెట్ ప్రాజెక్టును ఏలూరులో ప్రారంభించిన సందర్భంలో ‘అందరూ బాగుండాలి- అన్ని ప్రాంతాలు బాగుండాలి’ అని పరోక్షంగా రాజధాని అంశంపై మాట్లాడారు.
రాజధానుల అంశంపై జగన్ సర్కార్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన , సీపీఐ నేతలు రాజధాని తరలిస్తే రాష్ట్రాన్ని అగ్ని గుండం చేస్తాం, భూకంపాలను సృష్టిస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నా….జగన్ సర్కార్ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. అంతేకాకుండా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు కావల్సిన అన్ని వనరుల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. అవసరమైన నిధులను మంజూరు చేస్తూ పరోక్షంగా విశాఖకు పోవడం తథ్యం అని జగన్ సర్కార్ ప్రతిపక్షాలు, ప్రజలకు పరోక్ష సంకేతాలు ఇస్తోంది.
జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ కమిటీ నివేదికలపై అధ్యయనానికి ప్రభుత్వం హైపవర్ కమిటీ వేయడం, ఆ కమిటీ ఇప్పటికే రెండుమూడు సార్లు సమావేశం కావడం…ప్రభుత్వ వ్యూహంలో భాగమే. సోమవారం సమావేశమైన హైపవర్ కమిటీ రాజధాని రైతుల నుంచి ప్రతిపాదనలను కూడా కోరడం చర్చనీయాంశమైంది.
అలాగే ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల ప్రకటన, దానిపై చర్చ….తదితర సంప్రదాయాలను ప్రభుత్వం పూర్తి చేయనుంది. దాదాపు నాలుగు వారాలుగా రాష్ట్రంలో రచ్చకు దారి తీసిన రాజధానిపై అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు సమగ్రమైన వివరణ ఇచ్చేందుకే సీఎం జగన్ ఆసక్తి కనబరుస్తారనే సమాచారం.
రాజధాని ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత విధానాలు, శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేయడం, నాటి మంత్రి నారాయణ నేతృత్వంలో వ్యాపారవేత్తలు ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజధాని ప్రకటన, రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఆధారాలు, విచారణ తదితర అంశాలపై జగన్ దీటుగా సమాధానం ఇవ్వాలని సంకల్పించినట్టు తెలిసింది. ఏది ఏమైనా అమరావతి నుంచి పరిపాలనా రాజధాని తరలింపునకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందని చెప్పక తప్పదు.