ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సీబీఐ దాగుడు మూతలాట ఆడుతున్నట్టు కనిపిస్తోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ సీరియల్‌ను తలపిస్తోంది. రోజురోజుకూ ఉత్కంఠ కలిగిస్తోంది.
జగన్ బెయిల్‌ను రద్దు చేయాలా? వద్దా? అనే విషయాన్ని చెప్పేందుకు సీబీఐ ఎందుకింతగా తాత్సారం చేస్తున్నదో ఎవరికీ అంతు చిక్కడం లేదు. తాజాగా మరోసారి లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు సీబీఐ మరింత గడువు కోరవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేసు విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది.
రఘురామకృష్ణంరాజు, జగన్ తరపు న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలను లిఖితపూర్వకంగా సీబీఐ కోర్టుకు సమర్పించారు. కానీ సీబీఐ రెండు దఫాలు జగన్ బెయిల్ విషయమై సీబీఐ కోర్టు విచక్షణకే వదిలేసింది.
ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, లిఖిత పూర్వక వాదనలు వినిపించేందుకు పది రోజుల గడువు కావాలని ఈ నెల 14న కోర్టును సీబీఐ కోరింది. దీనికి సీబీఐ కోర్టు అంగీకరించింది. 12 రోజులు గడువు ఇచ్చినా సీబీఐ లిఖిత పూర్వక వాదనలు సిద్ధం చేసుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి మరింత గడువును సీబీఐ కోరడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు ఏకవాక్యంతో కోర్టుకు అఫిడవిట్ సమర్పించిన సీబీఐ… తాజాగా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయనుందో అనే చర్చ నడుస్తోంది. సీబీఐ వినతి మేరకు కోర్టు మరో నాలుగు రోజులు గడువు ఇచ్చింది.