లోకేషే కాదు, చంద్ర‌బాబూ నియోజ‌క‌వ‌ర్గాన్ని వెదుక్కోవాలా!

ఏదైనా రాజ‌కీయ పార్టీ  ఒక్కోసారి ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలు కావొచ్చు. అలాంటి ఓట‌ముల‌కు టీడీపీ ఏనాడూ మిన‌హాయింపు కాదు. ప‌చ్చ‌మీడియా చంద్ర‌బాబు నాయ‌క‌త్వం మీద ఎంత బాకా ఊదినా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఇప్ప‌టి వ‌ర‌కూ…

ఏదైనా రాజ‌కీయ పార్టీ  ఒక్కోసారి ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలు కావొచ్చు. అలాంటి ఓట‌ముల‌కు టీడీపీ ఏనాడూ మిన‌హాయింపు కాదు. ప‌చ్చ‌మీడియా చంద్ర‌బాబు నాయ‌క‌త్వం మీద ఎంత బాకా ఊదినా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఇప్ప‌టి వ‌ర‌కూ టీడీపీ ఐదు సార్లు అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటే.. అందులో గెలిచింది 1999లో ఒక‌సారి, 2014లో మ‌రోసారి మాత్ర‌మే. 2004, 2009, 2019 సార్వ‌త్రిక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి పాల‌య్యింది. వీటిల్లో కూడా 2004, 2019లో చిత్తు చిత్తుగా ఓడింది. పొత్తుల‌తో 1999, 2019 ఎన్నిక‌ల్లో మాత్రం నెగ్గింది. ఆ రెండు ప‌ర్యాయాలూ బీజేపీకి దేశ వ్యాప్త ఊపు ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇక ప్ర‌స్తుతానికి వస్తే.. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో చిత్త‌వుతున్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్క‌డ జ‌య‌కేత‌నం ఎగ‌రేస్తూ వ‌స్తోంది. 2019 అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనే కుప్పంలో చంద్ర‌బాబు నాయుడు మెజారిటీ హ‌రించుకుపోయింది. తొలి రెండు రౌండ్ల కౌంటింగ్ లో చంద్ర‌బాబు నాయుడు వెనుక‌బ‌డ్డారు. రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి చంద్ర‌బాబు నాయుడు కొన్ని ఓట్ల వెనుకంజ‌లో ఉన్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఎన్నిక‌ల‌కు వెళ్లి.. ప్ర‌ధాన‌మంత్రి పీఠానికి పోటీదారుడు అంటూ ప్ర‌చారం చేయించుకుని.. ఏదో ఎమ్మెల్యేగా గెలిచారు చంద్ర‌బాబు నాయుడు.

ఇక చంద్ర‌బాబు మెజారిటీ త‌గ్గిపోవ‌డం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన‌లేని ఉత్సాహం ఇచ్చింది. క‌ష్ట‌ప‌డితే కుప్పంలో పాగా వేయొచ్చ‌ని వారికి అర్థ‌మైంది. ఈ క్ర‌మంలో అక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ పుంజుకుంటున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో పోలైన మొత్తం ఓట్ల‌ను లెక్క‌వేస్తే.. కుప్పంలో టీడీపీకి ప‌డ్డ ఓట్లు 21,863 కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చిన ఓట్లు 62,297. ఇలా టీడీపీ క‌న్నా రెండు రెట్ల ఓట్ల‌ను అధికంగా సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

ఈ ఎన్నిక‌ల‌ను తాము బ‌హిష్క‌రించిన‌ట్టుగా టీడీపీచెప్పుకోవ‌చ్చు. అయితే బ‌హిష్క‌ర‌ణ అనేది సీరియ‌స్సే అయితే, వ‌చ్చిన 21 వేల ఓట్లు ఎలా ప‌డ్డాయి?  వాళ్లంద‌రికీ టీడీపీ బ‌హిష్క‌రించిన విష‌యం తెలియ‌దా? అనే ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ నేత‌లు డొంక తిరుగుడు స‌మాధానాలు చెప్పాల్సిందే!

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను టీడీపీ బ‌హిష్క‌రించ‌లేదు. వాటిని సీరియ‌స్ గానే తీసుకుని ప‌ని చేసింది. మ‌రి అప్పుడు కూడా టీడీపీకి అక్క‌డ ద‌క్కింది రెండో స్థాన‌మే! ఏదేమైనా.. కుప్పం ఓట్ల లెక్క‌లు మాత్రం చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేలా ఉన్నాయి. ఒక‌వైపు లోకేష్ కు త‌గిన నియోజ‌క‌వ‌ర్గాన్ని వెద‌కాల్సిన ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టుగా ఉన్నారు చంద్ర‌బాబు. ఇదే స‌మ‌యంలో వ‌చ్చేసారి కుప్పంలో పోటీ చేసే విష‌యంలో కూడా ఒక‌టికి ప‌ది స‌ర్వేల‌ను చేయించుకోవాల్సిన అవ‌స‌రం అయితే క‌నిపిస్తోంది. లేక‌పోతే అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో ఓట‌మితో చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ జీవితాన్ని ముగించాల్సి వ‌స్తుంద‌నే సందేశాన్ని ఇస్తోంది కుప్పం నియోజ‌క‌వ‌ర్గం!