తమను ఇంటికి సాగనంపేందుకు మోడీ సర్కార్ ఇంత బరితెగిస్తుందా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. కేంద్రప్రభుత్వం 1972 CCS నిబంధనలు మార్చుతూ కేంద్రప్రభుత్వం ఉద్యోగి 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి లేదా 50/55 సంవత్సరాల వయోపరిమితి దాటితే… ఏది ముందు పూర్తయితే వారు కంపల్సరీ గా పదవీ విరమణ చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఈ ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగులను ఇంటికి పంపే కుట్రలో భాగంగా…కేంద్రం విధించిన నిబంధనలపై అభ్యంతరకరంగా ఉన్నాయంటున్నారు. ఆ ఉత్తర్వుల్లో అలసత్వం, అశ్రితపక్ష పాతం, అవినీతి లాంటి జాడ్యాలతో సరిగా పని చేయని వారిని నిర్బంధ ఉద్యోగ విరమణ నిబంధనల కింద 30 ఏళ్ల సర్వీసు లేదంటే 50/55 ఏళ్ల వయోపరిమితి దాటిన వెంటనే ఇంటికి పంపించేలా ఉత్తర్వులు జారీ చేసింది.
పాలకులు చెప్పినట్టు నడుచుకోని వారిని ఇంటికి సాగనంపాలనుకుంటే ఇది సులభమైన మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఎంచుకుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను అసమర్థులుగా, పని దొంగలుగా చిత్రీక రించి…ఉద్యోగి ప్రస్థానాన్ని అత్యంత అమానవీయంగా, అవమానకరంగా ముగింపు పలకాలనుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగుల్లో పని సామర్థ్యాన్ని పెంచడానికి ఒకవైపు చెబుతూ, మరోవైపు నిత్యం అభద్రతతో గడిపేలా చేసే హక్కు ఎవరిచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ తలలపై కత్తి వేలాడుతుంటే పనిపై మానసిక స్థితి తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట మూడు నెలలకు ఒకసారి సిబ్బంది పనితీరును సమీక్షించి ఇంటికి పంపిం చాల్సిన వారిని గుర్తించేందుకు కసరత్తు ప్రారంభంకానుంది.
అన్ని శాఖల్లో 50/55 ఏళ్ల వయస్సు వచ్చిన వారు, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారి రిజిష్టర్లను ప్రత్యేకంగా నిర్వహించాలని కేంద్రం నుంచి సంబంధిత శాఖలకు ఆదేశాలు వచ్చాయి. ఆ రిజిష్టర్‌ను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించి సదరు ఉద్యో గిని తీసేయాలా? వద్దా అని నిర్ణయిస్తారు. ఈ రెండు అంశాల పరిధిలోకి వచ్చిన వారిని ప్రజా ప్రయోజనాల రీత్యా ఎప్పుడైనా ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
ఉద్యోగుల పదవీ విరమణకు నిబద్ధతపై నీలి నీడలున్నవారు, అసమర్థులు, చేసే ఉద్యోగంలో కొనసాగే పటుత్వం, సమర్థత లేని వారిని ఎంపిక చేయాలనే నిబంధనలు చెప్పేందుకు, చదువుకునేందుకు బాగానే ఉన్నా….అమలు విషయమే అసలు సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.