గో కరోనా.. గో.. అంటూ తన నినాదంతో సంచలనం రేపిన, ట్రోల్ పేజీల వారికి నెలలకు తరబడిన స్టఫ్ ను ఇచ్చిన కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధినేత రామ్ దాస్ అథవాలే కు కరోనా పాజిటివ్ గా తేలిందట. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరినట్టుగా సమాచారం. మంత్రిగా కన్నా తన చిత్రవిచిత్ర ప్రకటనలతోనే అథవాలే వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ఇండియాలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన రోజుల్లో అథవాలే తన అభిమానులతో కలిసి గో కరోనా.. గో.. అంటూ నినదించారు. ఆ నినాదం కరోనాకు వినపడిందో లేదో అంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్ పేజీల వారు బోలెడన్ని జోకులు కట్ చేశారు. ఇంకా అందుకు సంబంధించిన ట్రోలింగ్ రకరకాలుగా ట్రెండింగ్ లో ఉంది. ఆ స్థాయిలో అథవాలే నినాదం మార్మోగుతూ ఉంది.
విశేషం ఏమిటంటే.. 60 యేళ్ల అథవాలే కరోనాతో ఆసుపత్రిలో చేరడానికి కొన్ని గంటల ముందు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నటి పాయల్ ఘోష్ ను తన పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ మధ్యనే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశాడనే ఆరోపణలతో పాయల్ ఘోష్ వార్తల్లోకి వచ్చింది.
తన ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసిన ఆమె ఫిర్యాదు మేరకు విచారణ సాగుతూ ఉంది. ఇప్పుడామెను అథవాలే తన పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ కార్యక్రమంలో కొంతమంది పాల్గొన్నారు. మంత్రిగారికి కరోనా సోకిన వార్తల నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా ఉంది.