40ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా నాటకాలు ఆడారు చంద్రబాబు. అధికారం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి ఎన్నో నక్కజిత్తులు ప్రదర్శించారు. మీడియా సాయంతో పన్నిన కుట్రలు ఎన్నో. ఇవన్నీ ఒకెత్తు అయితే, ఇప్పుడు చంద్రబాబు ఆడుతున్న మహా డ్రామా మరో ఎత్తు.
జీవితంలో ఎప్పుడూ తనకీ స్థాయి వస్తుందని చంద్రబాబూ ఊహించి ఉండరు, అందులోనూ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకే తన కెరీర్ క్లైమాక్స్ కి చేరుతుందని, తను రోడ్డున పడతానని, తనని అష్టదిగ్బంధం చేసి అన్ని దారులూ మూసేస్తారని, ఆస్తుల్ని తనకి కాకుండా చేస్తారని అనుకోలేదు. కానీ ఆ ముచ్చట తీర్చేశారు జగన్. అందుకే డ్రామాల్లో జీవితకాల గరిష్టానికి చేరుకున్నారు చంద్రబాబు. ఎప్పుడూ జోలె పట్టని బాబు.. తొలిసారి తన రాజకీయ భవిష్యత్తు కోసం, ఆస్తుల కోసం జోలె పట్టి సింపతీ కోసం ట్రై చేస్తున్నారు.
అమరావతి జేఏసీ తరపున అన్ని ప్రాంతాలకు వెళ్తున్న చంద్రబాబు విరాళాలు సేకరిస్తూ మహా బాగా నటిస్తున్నారు. కంటతడి పెడుతున్నారు, జనాన్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్నారు, వారికి ఏడుపు రాకపోయినా తన హావభావాలతో ఏడిపిస్తున్నారు. పెద్ద పెద్ద వేదికలపై, కార్డ్ లెస్ మైక్ పెట్టుకొని మరీ మాట్లాడే బాబు.. ఇప్పుడు గుడిమెట్లపైనా, బడిమెట్లపైనా నిలబడి మాట్లాడుతున్నారు.
అమరావతిలో తాను, తన అనుయాయులు కొన్న ఆస్తులన్నీ పనికిరాకుండా పోతున్నాయన్న బాధ ఒకవైపు, మూడు రాజధానుల ఫార్ములా హిట్టయితే ఇక తాను బతికుండగా టీడీపీ అధికారంలోకి రాదన్న ఆవేదన మరైవైపు.. వీటన్నిటితో పాటు కొడుకు ప్రయోజకుడు కాలేకపోయాడన్న మనోవేదన మరోవైపు… ఇవన్నీ కలిసి బాబుని ఈ స్థితికి దిగజార్చాయి. బాబు రాజకీయ జీవితానికి ఇదే క్లైమాక్స్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
చంద్రబాబు సింపతీ కోసం చేస్తున్న పనులన్నీ పెద్ద డ్రామా అని జనాలకు అర్థమైపోవడమే ఇక్కడ పెద్ద ట్విస్ట్. చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ లను నమ్ముకుంటే, జనాలు నేచురల్ ఆర్టిస్ట్ లు. చంద్రబాబు మాటలు నమ్మినట్టే కనిపించినా.. అంతిమంగా వారి మద్దతు మాత్రం జననేత జగన్ కే. ఆ విషయం 2019 రిజల్ట్ తో తేలిపోయింది.