చంద్రబాబు తెలివితేటలు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. చంద్రబాబు లేదా ఆయన నేతృత్వం వహిస్తున్న టీడీపీ కరోనా విపత్కర పరిస్థితుల్లో నామమాత్రంగా కూడా సేవలందించడం లేదనే విమర్శలున్నాయి. ఎంతసేపూ సేవలు చేస్తున్న వారిపై పొగడ్త లతో సరిపెడుతూ, తన విషయానికి వచ్చే సరికి చంద్రబాబు సేవల్లో హరీమనిపిస్తున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో ఆయన ఆన్‌లైన్‌లో శనివారం సమావేశమయ్యారు. ఇంత వరకూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందుకున్న వారు కనీసం వెయ్యి మంది కూడా మించలేదు. కానీ జూమ్ మీటింగ్ పేరుతో బిల్డప్ మాత్రం ఆకాశమంత అనే రేంజ్‌లో ప్రచారం సాగుతోంది.
ఏపీలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారాలు, నెలలు గడిచిపోతోంది. మరోవైపు ఆక్సిజన్ అవసరం కూడా గణనీయంగా తగ్గింది. అయినా ఇంత వరకూ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు మాత్రం ఇంకా కొలిక్కి రానట్టే కనిపిస్తోంది.
ఎందుకంటే ఒకవేళ నాలుగు చోట్ల ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వుంటే, ఈ పాటికి దేశమంతా తామే ప్రాణ వాయువు అందిస్తున్నామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ప్రచారం చేసుకోవడం, దానికి ఎల్లో మీడియా బాకా ఊదడం పెద్ద ఎత్తున జరిగేది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున అందిస్తున్న వైద్య సేవలపై చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నో విపత్తులను చూశానని.. కరోనా వంటి సంక్షోభం చూడటం ఇదే తొలిసారి అని అన్నారు.
ప్రకృతి విపత్తు సమయాల్లో ఎన్టీఆర్ ట్రస్టు, టీడీపీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజా సేవే తమ అజెండా అని స్పష్టం చేశారు. వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నటుడు సోనూసూద్‌పై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు.
రియల్ హీరోగా ఆపత్కాలంలో అందరికీ అండగా నిలుస్తున్నారని సోనూససూద్‌ను చంద్రబాబు అభినందించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సోనూ.. ఈ గొప్ప పనిని ఇలాగే కొనసాగించాలని కోరారు. ఒక వైపు కరోనా వంటి సంక్షోభం చూడటం ఇదే తొలిసారి అంటున్న చంద్రబాబు… ఇప్పుడు కూడా జనానికి సాయం చేయకపోతే మరెప్పుడు చేయాలనుకుంటున్నారనే నిలదీతలు వెల్లువెత్తుతున్నాయి.