తన రాజకీయ భవిష్యత్‌కు విపత్కర పరిస్థితి ఎదురైతే తప్ప చంద్రబాబుకు కుప్పం గుర్తుకు రాలేదు. కరోనా మహమ్మారి వికటాట్టహాసం చేస్తూ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న కాలంలో అత్యంత వెనుకబడిన కుప్పం ప్రజల యోగక్షేమాల గురించి పట్టించుకోవాలన్న మనసు ఆ పెద్దాయనకు రాలేదు.
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో బతుకు జీవుడా అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుప్పం ప్రజల విపత్తు ఆయనకు పట్టలేదు. కానీ తనకు రాజకీయంగా విపత్తు వచ్చేసరికి నియోజకవర్గం గుర్తుకొచ్చింది. సొంత నియోజకవర్గమైన చంద్రగిరి పొమ్మంటే, ఎక్కడో కర్నాటక-తమిళనాడు బార్డర్లో ఉన్న కుప్పం ఆదరించింది.
1989 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు విజయాన్ని అందించిన ప్రజల బాగోగులను మరీ ముఖ్యంగా కరోనా సమయంలో చంద్రబాబు గాలి కొదిలేశారనే విమర్శలను మూటకట్టుకున్నారు. తాను, తన కుటుంబం మాత్రం హైదరాబాద్‌లో సురక్షితంగా కాలం వెళ్లదీశారు. లాక్డౌన్ తర్వాతైనా తనను 35 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలను పలకరించడానికి కుప్పం వెళ్లాలన్న మనసు రాలేదు.
కానీ కరోనా లాంటి మహమ్మారి చేయలేని పని, పంచాయతీ ఎన్నికల ఓటమి చేయగలిగింది. ఎట్టకేలకు చంద్రబాబు మెడలు వంచి తమ దగ్గరికి పరుగెత్తుకొచ్చేలా కుప్పం ప్రజలు చరిత్రాత్మక పంచాయతీ తీర్పు ఇచ్చారు. ఇది ఒక్క చంద్రబాబుకే కాదు, ప్రతి రాజకీయ నాయకుడికి గుణపాఠంగా చెప్పొచ్చు.
కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలకు ఎన్నికల జరగ్గా వైసీపీ 74 పంచాయతీల్లో విజయం సాధించడంతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యింది. కుప్పంలో ఏదో తేడా కొడుతుందనే సంకేతాలు పంచాయతీ ఎన్నికలు ఇచ్చాయి. దీంతో భవిష్యత్‌లో తన రాజకీయ భవిష్యత్‌కు ఎక్కడ ఎసరు వస్తుందోననే భయం చంద్రబాబును పట్టుకుంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఉరుకులు పరుగులపై ఆయన కుప్పం వెళ్లడానికి నిర్ణయించుకున్నారు.
ఈ నెల 25న చంద్రబాబు కుప్పం వెళ్లనున్నారు. 25, 26, 27 తేదీల్లో తన నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తారు. వారి కష్టసుఖాలు తెలుసుకోనున్నారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తన నియోజక వర్గ ప్రజలను పట్టించుకోని బాబు, ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ విపత్తులో పడే సరికి కుప్పం వెళుతున్నారనే కామెంట్స్ నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. కుప్పం ప్రజల్లారా …చంద్రబాబు అసలు నైజం అర్థమవుతోందా? అని ప్రశ్నిస్తున్నారు.