తనకు కులపిచ్చిని అంటగడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాపోయిన 48 గంటల్లోనే ఆయనలో అది ఏ స్థాయిలో ఉందో బయటపడిందని అంటున్నారు పరిశీలకులు. విజయవాడ స్వర్ణప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన ప్రమాదంపై చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మామూలుగా ఏ విశాఖలోనో, మరో చోటో.. తమ కులం వాళ్ల యాజమాన్యంలోని ఆసుపత్రిలో కాకుండా మరొకరి యాజమాన్యంలోని సెంటర్లో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుని ఉంటే.. దానిపై కనీసం వారం రోజుల పాటు చంద్రబాబు నాయడు స్పందించేవారని, జూమ్ మీటింగులు పెట్టి గత్తర చేసే వాళ్లని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ లీడర్లంతా స్పందించి.. ఇదంతా ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం అని దుమ్మెత్తి పోసే వాళ్లని, బాధితులను పరామర్శించి రాజకీయ ప్రసంగాలు చేయించే వాళ్లని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది వరకూ అనేక ఉదంతాల్లో చంద్రబాబు నాయుడు అండ్ కో ఇదే విధంగా స్పందించింది. చంద్రబాబు నాయుడు అలా చేసిన శవ రాజకీయాలు ఎన్నో ఉన్నాయి. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఉదంతంలో చంద్రబాబు నాయుడు ఎలా స్పందించారో అంతా చూశారు. ప్రభుత్వం గరిష్ట స్థాయిలో కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించినా, చంద్రబాబు నాయుడు కోటేం సరిపోతుంది? అంటూ ప్రశ్నించారు. అదే తన హాయాంలో అలాంటి ప్రమాదాలు జరిగితే చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు!
ఇక విజయవాడ స్వర్ణప్యాలెస్ ఉదంతంలో చంద్రబాబు నాయుడు స్పందించడం లేదు. ఎందుకంటే అది కమ్మ వాళ్ల ఆసుపత్రి ఆధ్వర్యంలో నడిచిన కేర్ సెంటర్. రమేష్ చౌదరి అనే ఆ వ్యక్తి తెలుగుదేశం యాక్టివ్ మెంబర్ కూడానట. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కిక్కురమనడం లేదని, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినా చంద్రబాబు నాయుడు కామ్ గా ఉన్నారని.. అదే వేరే కులం వాళ్ల ఆసుపత్రి అయ్యుంటే చంద్రబాబు నాయుడు రెచ్చిపోయే వారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తనకు కుల పిచ్చిని అంటగడుతున్నారంటూ వాపోయే చంద్రబాబు నాయుడు..ఇలాంటివన్నీ ప్రజలు గమనించరనే ఫీలింగ్ లో ఉంటారని, ఆయనకు వేరే వాళ్లు అంటగట్టాల్సిన అవసరం లేదని, ఆయన తీరే కులపిచ్చితో నిండి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఆఖరికి అధికార పక్షం కూడా మీడియాకు ఎక్కి.. స్వర్ణప్యాలెస్ ఉదంతం గురించి ఎందుకు స్పందించరు? అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించే పరిస్థితి వచ్చినా, స్వకులం కోసం చంద్రబాబు నాయుడు కామ్ గా ఉన్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.