మూడు రాజధానుల విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త సవాల్ విసిరారు. అదేమిటంటే..ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలట, అలా ఎన్నికలకు వెళ్లి గెలిచి వచ్చి మూడు రాజధానుల ప్రకటన చేసుకోవాలట, అందుకు బోనస్ గా తను రాజకీయాల నుంచి వైదొలగబోతున్నట్టుగా కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మూడు రాజధానుల ప్రకటన విషయంలో తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇలా కొత్త సవాల్ విసిరారు.
ఇది బాగానే ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు చంద్రబాబు నాయుడు ఏ ఎన్నికలను ఎదుర్కొన్నారు? విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గింది, దీంతో చంద్రబాబు నాయుడు కు అధికారం దక్కింది. తనకు తోచినట్టుగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించుకున్నారు. అందులో ప్రజాభిప్రాయం కానీ, కేంద్ర కమిటీల నివేదికల్లో పేర్కొన్న అభిప్రాయాలకు విలువ కానీ ఏమీ లేదు.
విభజన సమయంలో ఏపీ రాజధాని విషయంలో వేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. అయితే తన నిర్ణయాన్ని ప్రజలంతా ఒప్పుకున్నారని చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. అదెలాగో మాత్రం చెప్పలేదు!
అమరావతి రాజధాని అంటూ మూడేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఎన్నో డ్రామాలను ప్లే చేశారు. వాటన్నింటి తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యింది. ఎంతలా అంటే 23 సీట్లకు పరిమితం అయ్యింది. అదే అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడి తనయుడు ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. అయినా తన అమరావతి నాటకాలను ప్రజలు ఆమోదించారని, వాటికి మద్దతు పలికారని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉండటం ఆయన రాజకీయ దివాళకోరు తనాన్ని చాటుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.