చంద్ర‌బాబూ…ఇవి కూడా మీ బాధ్య‌త‌లే!

హ‌మ్మ‌య్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఓ పెద్ద ఊర‌ట‌. ఓ పెద్ద బాధ్య‌త‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జాస్వామ్యాన్ని, ప్రాథ‌మిక హ‌క్కుల‌ను కాపాడే బాధ్య‌త త‌న‌ద‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు…

హ‌మ్మ‌య్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఓ పెద్ద ఊర‌ట‌. ఓ పెద్ద బాధ్య‌త‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జాస్వామ్యాన్ని, ప్రాథ‌మిక హ‌క్కుల‌ను కాపాడే బాధ్య‌త త‌న‌ద‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు పౌరహక్కుల సంఘం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స‌ద‌స్సు వేదికైంది. 

విద్యుత్ చార్జీల‌ను త‌గ్గించ‌డం మ‌హాప్ర‌భో అంటూ నిన‌దిస్తున్న వామ‌ప‌క్ష కార్మికులు, రైతులు, వివిధ రాజ‌కీయ ప‌క్షాల భారీ ర్యాలీపై నిర్దాక్షిణ్యంగా కాల్పుల జ‌రిపించిన చంద్ర‌బాబు …. ఎప్ప‌టి నుంచి ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌కుడిగా పౌర‌హ‌క్కుల సంఘానికి క‌నిపిస్తున్నాడో అర్థం కాని ప్రశ్న. అంతా క‌రోనా కాల మ‌హిమ అని స‌రిపెట్టుకోవాలా? లేక ఉద్య‌మ సంస్థ‌ల్లో కొర‌వ‌డిన చిత్త‌శుద్ధి అనుకోవాలా?

హ‌క్కుల సూరీడు బాల‌గోపాల్ నేతృత్వం వ‌హించిన పౌర‌హ‌క్కుల సంఘ‌మే చంద్ర‌బాబుకు పౌర‌హ‌క్కుల దిక్సూచిగా చంద్ర‌బాబుకు స‌ర్టిఫికెట్ ఇచ్చిన నేప‌థ్యంలో, పౌర స‌మాజం మ‌రికొన్ని బాధ్య‌త‌లు అయ‌న‌పై పెట్టాల‌ని భావిస్తోంది. అంత‌కంటే ముందుగా పౌర‌హ‌క్కుల గురించి చంద్ర‌బాబు ఏం మాట్లాడారో తెలుసుకుందాం. పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం-భావవ్యక్తీ కరణ స్వేచ్ఛ’ అనే అంశంపై న్యాయవాది, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అధ్యక్షతన నిర్వహిం చిన వీడియో సమావేశంలో చంద్రబాబు  మాట్లాడారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని, ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు అంతా సంఘటితంగా పని చేద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రజాస్వామ్య వాదులు చేసే ప్రతి పోరాటానికీ తెదేపా మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యర్థుల పై దేశద్రోహం కేసు పెడతారని త‌న‌కు ఇంతవరకు తెలీద‌న్నారు. మొదటిసారి చూస్తు న్న‌ట్టు చెప్పుకొచ్చారు.  

మీడియాకు రాజకీయ నాయకులు భయపడటం మాని, రాజకీయ నాయకులను చూసి మీడియా భయపడే పరిస్థితి వచ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇంతా త‌న‌ను ఏఏ సంద‌ర్భాల్లో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో తిట్టారో ఆవేద‌న చెప్పారు. మొత్తానికి పౌర‌హ‌క్కుల సంఘం నిర్వ‌హించిన వీడియో స‌మావేశం బాబు త‌న బాధ‌లు ఏక‌రువు పెట్టుకునే వేదిక‌గా మార‌డం గ‌మ‌నార్హం. ఇంత కాలం చంద్ర‌బాబు అంటే మీడియా — మీడియా అంటే చంద్ర‌బాబే క‌దా అని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌దు.

ఇదే స‌మావేశంలో మ‌రో ముఖ్య నాయ‌కుడు సీపీఐ రామ‌కృష్ణ మాట్లాడారు. ప్రజలంతా కరోనాతో పోరాడుతుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, హక్కుల గురించి మాట్లాడుకునే దుస్థితి ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్‌రెడ్డికి చెంపపెట్టని అన్నారు.  

చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌లో బాల‌గోపాల్ లేని లోటు తీర్చే నాయ‌కుడు వ‌చ్చాడ‌ని సంతోషంగా ఉంది. కావున ప్ర‌జాస్వామ్యం, పౌర‌హ‌క్కులు కాపాడుతాన‌ని పిలుపునిచ్చిన నేప‌థ్యంలో కొన్ని విజ్ఞ‌ప్తులు పౌర స‌మాజం నుంచి వెల్లువెత్తుతున్నాయి.  ప్ర‌జాస్వామ్యం, పౌర‌హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల‌పై చంద్ర‌బాబే పోరాడాలి. 

ఎందుకంటే ఆయ‌న త‌న హ‌యాంలో ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను త‌న పార్టీలోకి ఫిరాయింపుల‌కు తెర‌లేప‌లేదు కాబ‌ట్టి. అలాగే త‌న కేబినెట్‌లో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌కుండా నీతి, నిజాయితీతో పాల‌న సాగించిన చ‌రిత్ర ఆయ‌న సొంతం కాబ‌ట్టి, వాటిపై కూడా చంద్ర‌బాబే పోరాడాలి. త‌ద్వారా ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడిట‌న‌ట్టే అవుతుంది.

అలాగే వెన్నుపోటు రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబే పోరాడాలి. త‌న‌కు పిల్ల‌నిచ్చిన మామ ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేయ‌లేదు కాబ‌ట్టి. త‌న‌కు రాజ‌కీయంగా మామ ఎన్టీఆర్‌పై వైశ్రాయ్ హోటల్ ఎదుట చెప్పులు వేయించింది చంద్ర‌బాబు కాదు కాబ‌ట్టి, ప్ర‌జాస్వామ్యంపై పోరాడే నైతిక హ‌క్కు చంద్ర‌బాబుకు ఉంద‌నే ఉద్దేశంతో ఓ మ‌హ‌త్త‌ర బాధ్య‌త‌ను పౌర‌స‌మాజంపై ఆయ‌న‌పై పెట్టాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

అలాగే త‌న‌కు రాజ‌కీయంగా క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచిన స‌డుగుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, బామ్మ‌ర్ది నంద‌మూరి హ‌రికృష్ణ‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన చ‌రిత్ర చంద్ర‌బాబుది కావ‌డం వ‌ల్ల‌, ఆయ‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకోవ‌చ్చు. అంతెందుకు ఇప్పుడు చంద్ర‌బాబు అంట‌కాగుతున్న సీపీఐ రామ‌కృష్ణ‌ ప్ర‌త్యేక హోదా, రాష్ట్ర విభ‌జ‌న హామీల అమ‌లు కోసం ఉద్య‌మిస్తున్నార‌నే కార‌ణంతో రెండు వారాల పాటు జైలుపాలు చేయ‌డానికి చంద్ర‌బాబు కార‌ణం కాదు కాబ‌ట్టి, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త‌ను ఆయ‌న‌కే అప్ప‌గించాలి.

అలాగే ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర‌కు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌నే డిమాండ్‌పై దీక్ష‌కు దిగిన ముద్రగ‌డ ప‌ద్మ‌నాభాన్ని, ఆయ‌న భార్య , కొడుకు, కోడ‌ళ్ల‌ను అమానుషంగా పోలీసుల‌తో కొట్టించిన పాల‌న చంద్ర‌బాబుది కాదు కాబ‌ట్టి ఆయ‌న‌కు మాత్ర‌మే ప్ర‌జాస్వామ్యం, పౌర‌హ‌క్కుల గురించి మాట్లాడే హ‌క్కు ఉంద‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పొచ్చు. బ‌షీర్‌బాగ్ కాల్పుల్లో ముగ్గురు వామ‌ప‌క్ష కార్య‌క‌ర్త‌లు అమ‌రులు కావ‌డానికి చంద్ర‌బాబు పాల‌న కార‌ణం కానే కాదు. అంతేనా ప్ర‌జాయుద్ధ నౌక గ‌ద్ద‌ర్ గుండెల్లో బుల్లెట్ దిగ‌డానికి చంద్ర‌బాబు పాల‌న కార‌ణం కాదు.

అయ్యా బాబూ…క‌మీష‌న్ పెంచండ‌ని వేడుకునేందుకు వెళ్లిన నాయీబ్రాహ్మ‌ణుల‌ను న‌డిరోడ్డుపై తోక‌లు క‌త్తెరిస్తాన‌ని అవ‌మానించిన పాల‌కుడు చంద్ర‌బాబు ఎంత మాత్రం కాదు. వేలాది మంది న‌క్స‌లైట్ల‌ను నిర్దాక్షిణ్యం ఎన్‌కౌంట‌ర్ చేసి, ఎంతో మంది త‌ల్లుల‌కు క‌డుపు శోకం మిగిల్చిన పాల‌కుడు చంద్ర‌బాబు కానేకాదు.

ప్ర‌జా ఉద్య‌మాల‌కు అండ‌గా నిలుస్తున్నార‌నే కార‌ణంతో బాల‌గోపాల్‌, హ‌ర‌గోపాల్ లాంటి మేధావులు, ఉద్య‌మకారుల‌పై లాఠీ జులిపించి ర‌క్తం రుచి చూపించిన క‌ర్క‌శ పాల‌న చంద్ర‌బాబుది కానే కాదు. అందుకే  జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జాస్వామ్యం, పౌర‌హ‌క్కుల కోసం ప్ర‌జాఉద్య‌మ‌కారుడు చంద్ర‌బాబు నేతృత్వంలో మ‌నమంతా క‌లిసి ముందుకు న‌డుద్దాం. 

హ‌క్కుల పోరాటాల‌కు రోల్ మోడ‌ల్స్‌గా నిలిచిన అమెరికా న‌ల్ల‌జాతీయుల ఉద్య‌మ‌కారుడు మార్టిన్ లూథ‌ర్‌కింగ్‌, ద‌క్షిణాఫ్రికాకు చెందిన నెల్స‌న్ మండేలా త‌దిత‌ర యోధానుయోధుల‌ను చంద్ర‌బాబులో చూసుకుందాం.

శ్రీ‌శ్రీ మాట‌ల్లో చెప్పాలంటే …. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి!

సొదుం ర‌మ‌ణ‌