తెలుగు సినిమాల్లో పీకడం అనేది చాలా రొటీన్ మాట అయిపోయింది. తెలుగు జనాలు, ప్రత్యేకించి బూతులు దారాళంగా మాట్లాడగలిగే వాళ్లు.. ఏం పీకుతారు? అనే డైలాగును తరచూ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పీకడం అనే మాటను మరింత బూతుగా ఎలా వాడతారో అందరికీ తెలిసిందే. దాన్నే కాస్త పాలిష్ చేసి *ఏం పీకుతావ్?* అంటూ గొడవల్లో ప్రశ్నించుకుంటూ ఉంటారు.
ఆ డైలాగును సినిమాల్లోకి నెమ్మదినెమ్మదిగా తీసేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కూడా స్వయంగా చిరంజీవి చేతే ఆ డైలాగును అనిపించారు పరుచూరి బ్రదర్స్. చిరంజీవి సినిమాల అంటే… అవి మాస్ మసాలా అయినా ఫ్యామిలీ ఆడియన్స్ తో మొదలుపెడితే చిన్న పిల్లలు కూడా చూస్తారు. అయినా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవితో కామెడీ పేరుతో ఆ డైలాగును పలికించారు.
కనీసం చిరంజీవి అయినా అభ్యంతరం చెప్పాల్సింది. తన సినిమాలను చిన్న పిల్లలు కూడా చూస్తారు.. వాళ్లపై ఈ మాటల ప్రభావం పడుతుందని. అయితే కామెడీ ఆయనకూ నచ్చినట్టుగా ఉంది.
ఇక కృష్ణవంశీ వంటి డైరెక్టర్ అయితే.. హీరోయిన్ తో కూడా ఆ డైలాగ్ పెట్టేశాడు. హీరోయిన్ చేత ఏం పీకుతావ్, గొంతు తప్ప ఏమైనా పిసుకు.. అని ముద్దుగా పలికించిన ఆ సినిమా పేరు *శ్రీఆంజనేయం*
ఇలా తెలుగు సినిమాకు దశాబ్దంన్నర కిందటే పీకడం అనే మాట అలవాటైంది. ఆ బూతును భరించాల్సిందే అని సినిమా వాళ్లు జనాల మీద రుద్దేశారు. హద్దులు దాటేశారు.
ఇక సినిమాల్లో రొటీన్ అయిన ఆ డైలాగు ఇప్పుడు తరచూ వాడుతున్నారు రాజకీయ నేతలు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ మంత్రులను తెలుగుదేశం తెగ తిడుతూ ఉంటుంది. స్వయంగా వారిని బూతుల మంత్రులు అని చంద్రబాబునాయుడు అనే వారు. అయితే.. చంద్రబాబు నాయుడు ఇప్పుడు బరితెగించి మాట్లాడుతున్నారు.
పంచాయతీ ఎన్నికల తీరుపై ఆయన స్పందిస్తూ.. బెదిరించి వైఎస్సార్సీపీ వాళ్లు గెలిచారని, తన హయాంలో అలా చేసి ఉంటే ఏం పీకగలిగేవారు? అంటూ ఆయన ప్రశ్నించేశారు! ఏం చేయగలిగేవారు? అనే మాటతో పోయే దానికి ఏం పీకగలిగే వారు? అంటూ ప్రశ్నించడం చంద్రబాబు నాయుడి సంస్కారం.
వైఎస్సార్సీపీలోని ఒకరిద్దరు మంత్రులు మాట్లాడితే ఫ్యామిలీ ఆడియన్స్ బుగ్గలు నొక్కుకున్నారు. అయితే ఏపీకి 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి, వయసులో వృద్ధుడు, మనవడికి సంస్కారం నేర్పించాల్సిన రాజకీయ నేత, తన ప్రెస్ మీట్లను గంటల పాటు లైవ్ టెలికాస్ట్ చేసే టీవీ చానళ్ల ముందుకు వచ్చి.. ఏం పీకుతారు? ఏం పీకే వారు? ఎలా పీకే వారు? అన్నట్టుగా మాట్లాడటం మాత్రం శోచనీయం.
చంద్రబాబు నాయుడు తీరు ఎలా ఉందంటే.. అమ్మా అనొద్దురా నీయమ్మా.. అన్నాడట ఒకడు. వైసీపీ మంత్రులను బూతుల మంత్రులు అంటూ.. ఈయన పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. ఇదంతా చంద్రబాబుకు అలవాటే కదా!