ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో తాను షాక్‌కు గురయ్యానని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. గౌతమ్ మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అపోలో ఆస్పత్రిలో గౌతమ్ మృతదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత రాత్రి 7.30 గంటలకు ఒక నిశ్చితార్థంలో గౌతమ్, తాను కలిసినట్టు ఆయన చెప్పారు. ఎంతో ఆదరణ భావంతో తనను పలకరించారన్నారు. తన తండ్రి రాజమోహన్‌రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి, ఆయన పక్క సీట్లో కూచోపెట్టడాన్ని ఆయన గుర్తు చేశారు.
నిశ్చితార్థ వేడుకలో ఎంతో ఉత్సాహంగా గౌతమ్‌రెడ్డి కనిపించాడన్నారు. ఉదయం 7.30 గంటలకు గౌతమ్ చనిపోయాడన్న వార్త తెలిసిందన్నారు. తాను ఆ వార్తను నమ్మలేకపోయానన్నారు. గౌతమ్‌రెడ్డి ఉన్నత విద్యావంతుడన్నారు. రాజకీయాల్లో హూందాగా వ్యవహరించే వారన్నారు.
చదువు, సంస్కారం ఉన్న నాయకుడు గౌతమ్ అని ఆయన ప్రశంసించారు. అలాంటి మేధావి, ఆదర్శ రాజకీయ నాయకుడిని సమాజం కోల్పోవడం బాధాకరమన్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి రాజకీయాల్లో పద్ధతైన నాయకులన్నారు. ఈ రెండున్నరేళ్లలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఏ ఒక్కర్నీ గౌతమ్ ఇబ్బంది పెట్టలేదన్నారు.
తన జిల్లాకు చెందిన ఉన్నత నాయకుడితో పాటు బంధువు, ఆప్త మిత్రుడైన గౌతమ్ ఇక లేరన్న విషయం చాలా ఆవేదన కలిగిస్తోందని ఆయన తెలిపారు.