వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌ను ఏకిపారేస్తూ వుంటారు. విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారంటే… వాళ్లిద్దరే టార్గెట్ అయి వుంటారని ఎవరైనా కళ్లు మూసుకుని చెబుతారు. కానీ తాజా ట్వీట్‌లో విజయసాయిరెడ్డి టార్గెట్ మారింది. మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్‌ను ఆయన టార్గెట్ చేయడం గమనార్హం.
మాన్సాస్ ట్రస్ట్‌కు సంబంధించి అశోక్‌గజపతిరాజు అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్‌గజపతిరాజు ముసుగు తొలిగిపోయిందని విజయసాయిరెడ్డి తనదైన స్టైల్‌లో ట్వీట్ చేశారు.
‘మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోంది. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయింది. దేవాదాయశాఖ అనుమతి లేకుండా ప్రైవేట్ వెబ్ సైట్ క్రియేట్ చేసి వేలం వేశారంటేనే అసలు ఉద్దేశమేంటో అర్థమైపోతుంది. వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తే ఉపయోగం ఏంటి రాజా?’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
దీనిపై నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేయడం గమనార్హం. అవినీతి జరిగినట్టు నిరూపించి శిక్షిస్తే సరిపోతుందని, దానికెందుకు ట్వీట్ చేయడం అని నెటిజన్లు ప్రశ్నిస్తుండడం గమనార్హం. కేవలం ఆరోపణలకే పరిమితమవుతూ, నిరూపణలో విఫలమవుతున్నారనేది ఎక్కువ మంది అభిప్రాయం.