మరోసారి అజ్ఞానం ప్రదర్శించిన చినబాబు!

చినబాబు మరోసారి నోరు చేసుకున్నారు. ఇటీవల తరచూ నోరు చేసుకుంటూనే ఉన్నారు. అయితే.. ఒక్కసారి నోరు తెరిస్తే చాలు.. ఏదో ఒక రూపంలో  తన అజ్ఞానాన్ని బయటపెట్టేసుకునే అలవాటు ఉన్న చినబాబు.. ఈ దఫా…

చినబాబు మరోసారి నోరు చేసుకున్నారు. ఇటీవల తరచూ నోరు చేసుకుంటూనే ఉన్నారు. అయితే.. ఒక్కసారి నోరు తెరిస్తే చాలు.. ఏదో ఒక రూపంలో  తన అజ్ఞానాన్ని బయటపెట్టేసుకునే అలవాటు ఉన్న చినబాబు.. ఈ దఫా మళ్లీ అదే పని చేశారు. 

చినబాబు అజ్ఞానం లోంచి పుట్టిన కామెడీ ఇటీవలి కాలంలో తగ్గిపోతోందేమిటి చెప్మా.. అని నిరీక్షిస్తున్న ప్రజలకు చినబాబు మళ్లీ పని పెట్టారు. వారు నవ్వుకోవడానికి, తన మీద జాలి పడడానికి బోలెడంత అవకాశం ఇచ్చారు. 

ఇంతకూ ఏం జరిగిందంటే.. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలుగుదేశానికి చెందిన నాయకుడు తిక్కారెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు. కోసిగి మండలం పెద్దభూంపల్లిలో ఆంజనేయస్వామి రథోత్సవం  జరుగుతోంటే.. తిక్కారెడ్డి తన అనుచరుల్ని వెంటబెట్టుకుని అక్కడకు వచ్చారు. అక్కడ ఆయన మీద దాడి జరిగింది. సహజంగా ఆ పనిచేసిన వారు ఆయన ప్రత్యర్థులు! ఆయన అనుచరులు వారితో తలపడడం జరిగింది. అయిదుగురికి గాయాలు మొత్తానికి చావులేమీ లేకుండా ఆ వ్యవహారం ముగిసింది. 

తిక్కారెడ్డికి ప్రత్యర్థులు ఉన్నారు. వారి నడుమ కక్షలు ఉన్నాయి. గతంలో కూడా రెండుసార్లు ఆయన మీద హత్యాయత్నం జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ కక్షల నేపథ్యంలో తాజా దాడి కూడా చోటు చేసుకున్నాయి. తిక్కారెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు గనుక.. ఆటోమేటిగ్గా.. ఆయ ప్రత్యర్థులు వైఎస్సార్ కాంగ్రెస్ లోనే ఉంటారు. 

దాడి జరిగినప్పటినుంచి తెలుగుదేశం పార్టీ.. అధికార పార్టీ.. తెలుగుదేశం వారినందరినీ అంతమొందించడానికి హత్యారాజకీయాలు నడుపుతున్నదంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. 

తిక్కారెడ్డి ప్రత్యర్థులు నిజంగానే వైసీపీలో ఉంటే గనుక.. తమ పార్టీ అధికారంలో ఉన్నది గనుక.. కేసుల విషయంలో కొంత ఎడ్వాంటేజీ ఉంటుందని వారు అనుకుని ఉండొచ్చు. అందుకు దాడికి తెగబడి ఉండొచ్చు. అంతమాత్రాన అది వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ చేయిస్తున్న హత్యారాజకీయం ఎలా అవుతుంది.

అధికార పార్టీ అండ చూసుకుని తిక్కారెడ్డి ప్రత్యర్థులు హత్యకు ప్రయత్నించారని ఆరోపిస్తే అది చాలా ధర్మంగా ఉండేది. కానీ.. ఈ హత్యలు జగనే చేయిస్తున్నట్టుగా వ్యాఖ్యానించడం వల్ల.. తెలుగుదేశం నాయకులు తలాతోకా లేని మాటలతో తమ విలువ పోగొట్టుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఇదేతరహా అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. 

అయితే ఈ సందర్భంగా నారా లోకేష్ తన అవివేకాన్ని కూడా బయటపెట్టుకోవడం విశేషం. ‘‘కత్తిని నమ్ముకున్న వాడు కత్తికి బలవ్వక తప్పదనే చరిత్ర చెబుతున్న సత్యాన్ని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి.’’ అంటూ లోకేష్ తన ఖండనలో హెచ్చరించారు. ఈ మాటలు ఆయన ప్రత్యర్థి పార్టీని తిడుతున్నట్లా? లేదా సొంత నేత తిక్కారెడ్డిని తిడుతున్నట్లా? తిక్కారెడ్డి కూడా కత్తికి నమ్ముకున్న నాయకుడు గనుకనే.. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారనే అర్థం వచ్చేలా లోకేష్ మాటలు ఉన్నాయి. 

అవివేకం పీక్స్ కు వెళితే.. సినిమాటిక్ డైలాగులు వండి తన ఖండనల్లో, ట్వీట్లలో అర్థం తెలియకుండా వడ్డించేస్తే ఇలాగే ఉంటుంది. ప్రత్యర్థులను తిడుతున్నాం అనుకుని.. సొంత వారినే తప్పుపట్టినట్లు బయటపడిపోతుంది. 

లోకేష్ చెప్పిన మాట నిజమే గానీ.. విమర్శిస్తున్నాం అనే భ్రమలో సెల్ఫ్ గోల్ వేసుకున్న సంగతిని ఆయన ఎప్పటికి గుర్తిస్తారు. ఈ దాడివలన సదరు తిక్కారెడ్డికి ఏ కొంతైనా సానుభూతి వచ్చేట్లయితే.. లోకేష్ కామెంట్ తో ఆ సానుభూతి కూడా మంటగలిసిపోయేలా ఉంది.