అధికారంలో ఉన్నది ఎన్డీయే అయినా, యూపీయే అయినా.. తనకంటూ ఒక కేబినెట్ బెర్త్ ను రిజర్వ్ లో పెట్టుకునే వారు రామ్ విలాస్ పాశ్వాన్. బీజేపీ ప్రధాన మంత్రి ఉన్నా, కాంగ్రెస్ ప్రధాన మంత్రి ఉన్నా పాశ్వాన్ మాత్రం కేంద్రమంత్రిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎవరు అధికారంలోకి వచ్చే సందర్భాల్లో వాళ్లతో చేతులు కలుపుతూ, తన రాజకీయ మనుగడను కాపాడుకున్నారు.
ఢిల్లీలో ముప్పై యేళ్లుగా ప్రభుత్వం కేటాయించిన ఒకే నివాసంలో ఉండగలిగాడంటే.. పాశ్వాన్ పరపతిని అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీ అధినేతలకు, కమ్ కేంద్రమంత్రులకు కేటాయించే తరహా నివాసంలోనే పాశ్వాన్ ఉంటూ వచ్చారట. ముప్పై యేళ్లుగా ఆయన ఆ ఇల్లు ఖాళీ చేసిందే లేదట! అలా పాతుకుపోయారాయన.
ఆయన మరణం తర్వాత ఆయన తనయుడు ఎల్జేపీ అధినేత హోదాలో అదే నివాసంలో ఉంటూ వచ్చారు. ఎన్డీయేలో భాగస్వామి పార్టీ కావడం, ఆరు మంది ఎంపీలున్న పార్టీకి పార్లమెంటరీ విభాగం అధ్యక్ష హోదాలో ఉన్న నేత కావడంతో చిరాగ్ పాశ్వాన్ కూడా అదే ఇంట్లో మకాం కొనసాగించినట్టున్నాడు. అయితే ఇటీవల ఎల్జేపీ పరిణామాలు అనేక మలుపులు తిరిగాయి.
చిరాగ్ పాశ్వాన్ కు కాస్తంత ప్రాధాన్యతను కూడా ఇవ్వడం లేదు మోడీ సర్కారు, బీజేపీ. ఆయన పై తిరుగుబాటు చేసిన నేతకే అగ్రతాంబూలం దక్కుతోంది. ఎల్జేపీ పార్లమెంటరీ విభాగం అధినేతగా పశుపతి పరాస్ నే గుర్తించారు లోక్ సభ స్పీకర్.
ఇటీవలే ఆయనకు కేంద్రమంత్రి పదవి కూడా దక్కింది. ఈ క్రమంలో ఇప్పుడు చిరాగ్ ను ఇంటి నుంచి కూడా ఖాళీ చేయించే పని మొదలుపెట్టారట. ఈ మేరకు రామ్ విలాస్ పాశ్వాన్ కాలం నుంచి వారి కుటుంబం బస చేస్తున్న ఢిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ అయినట్టుగా సమాచారం.
మొత్తానికి ఏడాది కిందటి వరకూ బీజేపీ చెప్పినట్టల్లా ఆడుతున్నాడనే పేరును తెచ్చుకున్న చిరాగ్ పాశ్వాన్ కు ఒక్కొక్కటిగా అన్నీ చేజారుతున్నట్టుగా ఉన్నాయి. పార్లమెంటరీ విభాగం అధ్యక్ష పదవి, కేంద్రమంత్రి పదవి పై ఆశలు అన్నీ పోయాయి. ఇక లోక్ సభ స్పీకర్ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించారు చిరాగ్. అక్కడ కూడా పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశాలు లేనట్టే.
ఇక అసలు ఎల్జేపీ తమదేనంటూ తిరుగుబాటు వర్గం ఇప్పటికే ప్రకటించుకుంది. ఈయనను సస్పెండ్ అంటోంది. ఈ నేపథ్యంలో ఇక పార్టీ గుర్తుమాత్రమే ప్రస్తుతానికి చిరాగ్ వద్దన ఉన్నట్టుగా ఉంది. దాన్ని ఎన్నికల కమిషన్ తేల్చాల్సి ఉంది.