cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Chiru

'చే' నుంచి 'ఛీ' వ‌ర‌కు ప‌వ‌న్ ప్ర‌స్థానం

'చే' నుంచి 'ఛీ' వ‌ర‌కు ప‌వ‌న్ ప్ర‌స్థానం

ప‌వ‌న‌న్నా న‌మ‌స్కారం. నేను నీ అభిమాని. ఇది నిన్న‌టి మాట‌. ఎప్పుడైతే బీజేపీతో క‌ల‌సి ప్ర‌యాణం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నావో అప్పుడే నీ దారి నుంచి త‌ప్పుకోవాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నాను. అన్నా నీపై చాలా కోపం వ‌స్తోంది. కానీ త‌మాయించుకుంటున్నాను. నేనే కాదు, నాలాగా చాలా మంది ప‌రిస్థితి ఇదే. ఈ సంద‌ర్భంగా నీ నుంచి దూరంగా పోతూ పోతూ...నిన్ను నిందించే ఉద్దేశం ఒక్క శాతం కూడా లేదు. ఎందుకంటే త‌ప్పు నీది కాదు. నిన్ను న‌మ్మి నీతో ప్ర‌యాణించాల‌నుకున్న నాలాంటి వాళ్లే స‌రిదిద్దుకోలేని త‌ప్పు చేశాం.

2014లో ‘ఒక‌టో నెంబ‌ర్ హెచ్చ‌రిక’ అని ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ అరుణ్‌సాగ‌ర్ మంచి వ్యాసం రాశారు. చ‌నిపోయిన ఆయ‌న గురించి ఈ రోజు గుర్తు చేసుకుంటున్నామంటే ఆయ‌న‌కు చావు లేన‌ట్టే. నీ గురించి లోకానికి జ్ఞానోద‌యం చేస్తూ రాసిన ఆ అద్భుత‌మైన వ్యాసం మ‌రోసారి ఈ సంద‌ర్భంగా చ‌దివాను. చ‌చ్చి ఏ లోకాన ఉన్నాడో గానీ, ఆయ‌న‌ది ఎంత ముందు చూప‌న్నా.

‘‘డియర్ చే( చేగువేరా). మమ్మల్ని క్షమించు. ఓ అజ్ఞాని చేసిన అపచారానికి, దాన్ని ఆనాడే నిలదీయకుండా లైటు తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు. నువ్వు నలుగురికీ కొత్తగా పరిచయమవుతావనీ, నువ్వు కొన్ని కొత్త హృదయాలను వెలిగిస్తావని, నువ్వు కొన్ని కొత్త ఆవేశాలను రగిలిస్తావని ఆశతో ఆకాంక్షతో సహించాం. ఇప్పుడిక తాటతీస్తాం’’ అని అరుణ్‌సాగ‌ర్ ఎంత బాగా చెప్పాడ‌న్నా.

కానీ నువ్వు చెప్పింది ఏంటి, చేస్తున్న‌దేంటో క‌నీసం నీకైనా అర్థ‌మ‌వుతోందా అన్నా. తెల్ల‌నివ‌న్నీ పాలు, న‌ల్ల‌నివ‌న్నీ నీళ్లు కాదు అని తెలుసుకోడానికి నాలాంటి వాళ్ల‌కు ఇన్నేళ్లు ప‌ట్టింద‌న్నా. ఎంత బాగా జ్ఞానోద‌యం చేశావ‌న్నా. ‘చివ‌రి వ‌ర‌కు పోరాడ గ‌లిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య అయిన విజ‌యం సాధించ‌వ‌చ్చు’ అని చేగువేరా ఏనాడో చెప్పారు. ప‌దేప‌దే చేగువేరా నామ‌స్మ‌ర‌ణ చేసే నువ్వు ఏనాడైనా పోరాడావా?  కేవ‌లం చే గురించి ప్ర‌స్తావిస్తే చాలా...అన్ని పోయిపోతాయా?

అన్యాయ‌మే చ‌ట్ట‌మైన‌ప్పుడు ఎదురించ‌డం నీ బాధ్య‌త కావాలి అని చేగువేరా సందేశం నుంచి నీవు పొందిన స్ఫూర్తి ఏంటి?  దేశాన్ని అట్టుడికిస్తున్న పౌర‌స‌త్వ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌పై వివిధ భాష‌ల సినీ ప్ర‌ముఖులు, నిన్న‌టికి నిన్న అమెరికాలో ఉన్న సత్యం నాదెళ్ల కూడా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ మోడీ విధానాల‌ను వ్య‌తిరేకించ‌డానికి నీకు మాత్రం మ‌న‌సు రాలేదు. అన్యాయంపై దేశం యావ‌త్తు ఎలుగెత్తి నిన‌దిస్తుంటే ఎదురించ‌డం నీ బాధ్య‌త కాదనుకున్నావా అన్నా?

‘‘సరే కానీ గురూ, ఇవన్నీ పక్కనపెట్టు. నీ నుంచి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలను ఆశించడం వెర్రివాళ్లు చేసే పనే. కానీ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. నీకు కుత్బుద్దీన్‌ అన్సారీ ఎవరో తెలుసా? ఫేస్‌ ఆఫ్‌ గుజరాత్‌ రాయిట్స్‌ను నువ్వు గుర్తు పట్టగలవా. గర్భిణుల కడుపులు చీల్చి, కుటుంబాలకు కుటుంబాలను ఇళ్లల్లో తలుపులు వేసి బంధించి సజీవ దహనాలు చేసి, వీధిలో, బడిలో, బేకరీలో కత్తులు, గొడ్డళ్లు, త్రిశూలాలు చేతబట్టి వెంటాడి వేటాడి నెత్తురు పారించిన రక్తపు వాసన నీ ముక్కుకు తెలుసా. మోడీ మీద నమ్మకం. తొక్కలోది’’

అన్నా చ‌చ్చి ఎక్క‌డున్నాడో తెలియ‌ని ఆ మ‌నిషి అడుగుతున్న ప్ర‌శ్న‌లు నీ చెవికెక్కుతున్నాయా? ఎక్క‌వ‌ని మాకు తెలుసు. ఎందుకంటే నీకేమీ తెలియ‌దు. నువ్వుచెప్పే విప్ల‌వ క‌విత్వం, నీ మాట‌ల్లో ఆవేశం...అంతా న‌ట‌నే అని తెలుసుకోడానికి ఈ తెలుగు స‌మాజానికి ఎంత కాలం ప‌ట్టింద‌న్నా? అబ్బో నీ మాట‌ల‌కు ఓ లెక్క, తిక్క ఉన్నాయంటే...ఏమో అనుకున్నాం. కానీ ఎలాంటి లెక్క‌లేసుకోకుండా నిన్ను పిచ్చిగా అభిమానించాం చూడు...మాలాంటి వాళ్ల‌కే తిక్క‌.

‘‘బెటర్‌ లేట్‌ దేన్‌ నెవర్‌. ఇప్పుడొక బహిరంగ హెచ్చరిక. ముందు నీ ఇంటి గోడ మీద చే బొమ్మ తీసేరు. నీ సినిమాల్లో సెట్‌ ప్రాపర్టీల్లో చే బొమ్మను ఎడిట్‌ చేసెరు. నువ్వు మోడీ తీర్థం తాగుతావో, చంద్రబాబు స్పాన్సర్డ్‌ పాట పాడుకుంటావో నీ ఇష్టం. బట్‌. చే కి దూరంగా ఉండు. నీకిక ఆ అర్హత ఏ మాత్రమూ లేదు. నీకే చెబుతుంది వినిపిస్తుందా?’’...వినిపిస్తోందా ప‌వ‌న‌న్నా?

మోడీ స‌ర్కార్ రాష్ట్రానికి ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తే...దాన్ని పాచిపోయిన ల‌డ్డూతో పోల్చి శ‌భాష్ అనిపించుకున్నావ్‌. ఇప్పుడు ఏకంగా ఆ పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చిన చేత్తో అంద‌జేసిన‌ క‌షాయ‌మే తాగుతున్నావ్‌. ఇక మీద‌ట నీ చేతుల మీదుగా మా చెవుల్లో క‌మ‌లం పువ్వును పెట్టించుకోడానికి సిద్ధం లేము. అన్నా ఇక మీద‌ట నీ పాత్ర వీర్ సావ‌ర్క‌ర్ అట క‌దా. చే నుంచి మొద‌లైన నీ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని చివ‌రికి నేను ఛీ కొట్టాల్సి వ‌స్తుంద‌ని  ఏనాడూ క‌ల‌లో కూడా అనుకోలేద‌న్నా.  అన్నా ఈ బ‌హిరంగ లేఖ ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజానికి రెండో నెంబ‌ర్ హెచ్చ‌రిక‌.

ఇట్లు
మీ తాజా మాజీ అభిమాని