తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టడం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకోవడం పచ్చపాత మీడియాకు అలవాటే. ఇటీవలి కాలంలో తప్పుడు కూతలు ఎక్కువ కావడం వల్లే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇలాంటివారిపై ఉక్కుపాదం మోపాలనుకుంటోంది. ఇలాంటి రాతల్లో సోషల్ మీడియాను మించిపోయింది ఆంధ్రజ్యోతి.
అసలు విషయం తెలిసినా కూడా ప్రభుత్వంపై నిందలేయడమే పనిగా పెట్టుకుంది. అయితే ఇటీవల ఈ వ్యవహారం మరీ శృతి మించడంతో నేరుగా సీఎం కార్యాలయం లైన్లోకి వచ్చింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు సీఎంఓ అధికారి డాక్టర్ హరికృష్ణ.
అసలేం జరిగిందంటే..?
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నివాసి చల్లా వీరనాగరాజు కొన్నాళ్ల క్రితం కరెంట్ షాక్ కి గురై తీవ్రంగా గాయపడ్డాడు. విజయవాడలోని వి-కేర్ ఆస్పత్రిలో చేర్పించగా వారు ఎడమ చెవి, ఎడమ చేయి, ఎడమ కాలు తొలగించి ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ సరిగా చేయకపోవడంతో ఇన్ఫెక్షన్ సోకి శరీరమంతా పాకింది. దీంతో మరోసారి ఆస్పత్రికి వెళ్లగా.. మరో 3 ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని, అందుకు 19 లక్షలు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేసిచ్చారు. ఆ ఎస్టిమేషన్ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు ద్వారా నాగరాజు అర్జీ పెట్టుకున్నారు.
అయితే 19లక్షల ఎస్టిమేషన్ చూసి సీఎంఓ అధికారులు లోతుగా పరిశీలించారు. ఆరా తీయగా.. అసలు వి-కేర్ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు సరిగా లేవని, నిబంధనలు పాటించరని తేలింది. అంతే కాదు.. అపోలో, గ్లోబల్, స్టార్, యశోదా వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో సదరు ఆపరేషన్లకు అయ్యే ఖర్చు కేవలం 5 లక్షలే అని తేలింది. ఈ వివరాలన్నీ నాగరాజుకి తెలియజేసి మరోసారి ఎస్టేమేషన్ వేయించుకు రమ్మన్నారు అధికారులు.
ఈ విషయం ఎలాగో ఆంధ్రజ్యోతికి చేరింది. ఇంకేముంది, తమకి అనుకూలంగా కథనాన్ని వండివార్చారు. సీఎంఓ కార్యాలయం వారు తమకి సంబంధించిన ఆస్పత్రులలోనే ఆపరేషన్ చేయించుకోవాలని బాధితులపై ఒత్తిడి తెస్తున్నారని, అలా అయితేనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తామంటూ బెదిరిస్తున్నారని తప్పుడు రాతలు రాసింది ఆంధ్రజ్యోతి. పూర్తి నిరాధారమైన ఈ అవాస్తవ కథనాలపై సీఎం కార్యాలయం తరపున డాక్టర్ హరికృష్ణ స్పందించారు.
వి-కేర్ ఆస్పత్రి చెప్పినట్టు సంబంధిత ఆపరేషన్ కోసం 19లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని నిరూపించాలంటూ ఆంధ్రజ్యోతికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తప్పుడు కథనాలతో బాధితుల్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ఓ మంచి పథకంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. కొంతమంది బ్రోకర్లు, నకిలీ ఆస్పత్రులు సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు కాజేయాలనుకుంటున్నాయని తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
ఎవరూ ప్రశ్నించరనే గుడ్డి నమ్మకంతో ఆంధ్రజ్యోతి చేతికొచ్చినట్టు రాయడం, నోటికొచ్చినట్టు మాట్లాడటంతో నేరుగా అధికారులే స్పందించాల్సి వచ్చింది. మరి ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ ఓపెన్ ఛాలెంజ్ స్వీకరిస్తుందో లేదో చూడాలి.