ఎగిరెగిరి పడ్డ రేవంత్ కి కాంగ్రెస్ మార్కు కళ్లెం..!

కేటీఆర్ చెప్పినట్టు.. పీసీసీ చీఫ్ అనే పదవి రాగానే రేవంత్ రెడ్డి నిజంగానే పీఎం పోస్ట్ వచ్చినంత హడావిడి చేశారు. కేసీఆర్, కేటీఆర్ సహా.. అందర్నీ ఓ రౌండేసుకున్నారు. అక్కడితో ఆగితే బాగుండేది కానీ,…

కేటీఆర్ చెప్పినట్టు.. పీసీసీ చీఫ్ అనే పదవి రాగానే రేవంత్ రెడ్డి నిజంగానే పీఎం పోస్ట్ వచ్చినంత హడావిడి చేశారు. కేసీఆర్, కేటీఆర్ సహా.. అందర్నీ ఓ రౌండేసుకున్నారు. అక్కడితో ఆగితే బాగుండేది కానీ, సొంత పార్టీ నేతల్నే చీదరించుకున్నారు. కోవర్డులు పార్టీ వీడి పోవాలంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. స్థానిక నాయకులకు సమాచారం లేకుండానే వారి నియోజకవర్గాల్లో దళిత, గిరిజన దండోరా సభలు పెట్టారు. దీనిపై అధిష్టానానికి పలు ఫిర్యాదులందాయి.

ఈ క్రమంలో ఇటీవలే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి టీమ్ కలసి వచ్చింది. అయితే ఆయనను అధిష్టానం మెచ్చుకున్నట్టు రేవంత్ అనుకూల వర్గం ప్రచారం చేసుకుంది. కట్ చేస్తే, రేవంత్ తోక కట్ చేసేందుకు అధిష్టానం పగడ్బందీ వ్యూహాన్ని అమలులో పెట్టినట్టు అర్థమవుతోంది.

గతంలో ఎప్పుడూ లేనట్టు టీపీసీసీ పరిధిలో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అంతే కాదు, ఇందులో రేవంత్ వ్యతిరేక గ్రూపుకి ప్రాధాన్యమిచ్చింది. దీంతో రేవంత్ దూకుడికి కాంగ్రెస్ కళ్లెం వేసినట్టేనని తెలుస్తోంది. మాణిక్కం ఠాగూర్ చైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీకి కన్వీనర్ గా షబ్బీర్ అలీని నియమించారు. ఇందులో రేవంత్ రెడ్డి జస్ట్ ఓ సభ్యుడు మాత్రమే. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీహెచ్ సహా.. ఆయన్ను వ్యతిరేకించే చాలామందికి ఇందులో చోటు దక్కింది.

గతంలో టీపీసీసీకి ఓ కోర్ కమిటీ ఉండేది. రాజకీయ నిర్ణయాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో తీసుకునేవారు. ఈ స్థానంలో అధిష్టానం ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పేరుతో పీఏసీని నియమించింది. ఇకపై పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని చెప్పడానికే ఈ కమిటీ తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం ఇచ్చాక తెలంగాణ కాంగ్రెస్ కి కాస్త ఊపొచ్చినట్టు కనిపించినా, ఆయన్ని చంద్రబాబు శిష్యుడిగానే ఇంకా అందరూ భావిస్తున్నారు. అందుకే దూరం పెట్టారు. కాంగ్రెస్ మనిషిగా రేవంత్ కి గుర్తింపు లేదు. కాంగ్రెస్ లోనే పుట్టి, కాంగ్రెస్ లోనే పెరిగి, కాంగ్రెస్ తోనే ఉంటున్న చాలామందికి రేవంత్ అజమాయిషీ ఇష్టంలేదు. అసంతృప్తులందర్నీ బుజ్జగించడంతోపాటు, రేవంత్ దూకుడుకి కళ్లెం వేసేందుకే అధిష్టానం పీఏసీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇకపై టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఏ రాజకీయ ప్రకటన చేయాలన్నా, సభలు, సమావేశాలు పెట్టాలన్నా, పాదయాత్రలు చేపట్టాలన్నా.. దానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆమోదం తప్పనిసరి. అక్కడ ఏకాభిప్రాయం వచ్చాకే రేవంత్ రెడ్డి ప్రకటనలు చేయాల్సి ఉంటుంది. అంటే ఇకపై ఏకపక్షంగా రేవంత్ రెడ్డి ఇష్టారీతిన వ్యవహరించడం కుదరదన్నమాట.