గత 24 గంటల్లో అమెరికాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య దాదాపు 25,325. ఇందులో విశేషం ఏమిటంటే.. దాదాపు రెండున్నర నెలల తర్వాత అమెరికాలో ఇంత తక్కువ స్థాయి కేసులు నమోదయ్యాయి. జూన్ 16వ తేదీన అమెరికాలో నమోదైన కేసుల సంఖ్య 25,543. ఆ తర్వాత ఆ దేశంలో కరోనా కేసులు ప్రతి రోజూ పెరుగుతూ పోయాయి. ఒక దశలో రోజుకు 78,615కు చేరాయి. జూలై 24న అమెరికాలో అలా కరోనా పీక్స్ కు చేరింది. ఆ తర్వాత దాని ఉదృతి తగ్గుతూ వస్తోంది.
కొన్ని రోజుల పాటు 70 వేల స్థాయిలోనే పెరుగుదల కొనసాగినా.. ఆ తర్వాత మాత్రం తగ్గుదల చోటు చేసుకుంటూ వస్తోంది. 60 వేల స్థాయిలో కొన్ని రోజులు, 50 వేల స్థాయిలో కొన్ని రోజులు, 40 వేల స్థాయిలో మరి కొన్ని రోజులు కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ తగ్గుదల ఇప్పుడు 25 వేల స్థాయికి చేరింది. ఇలా రెండున్నర నెలల తర్వాత అమెరికాలో కరోనా కేసుల కనిష్ట స్థాయికి చేరింది.
మరోవైపు వ్యాక్సిన్ కోసం కూడా అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా లక్ ఏమిటంటే.. ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నా.. కరోనా కారణ మరణాల సంఖ్య కూడా అక్కడ క్రమంగా తగ్గుతూ ఉంది.
ఇదే పరిస్థితే మరో నెల రోజులు కొనసాగితే.. అమెరికాలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయినా ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఈ మహమ్మారి వ్యాప్తి తగ్గుతుందటం ఊరటను ఇచ్చే అంశమే కానీ, ఇండియాలో మాత్రం సంఖ్య పెరుగుతూనే ఉండటం ఆందోళనకరమైన అంశం.