ఒకవైపు థర్డ్ వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలుకుని దేశీయంగా అనేక వైద్య సంస్థలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి బడులు తెరుస్తారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే హెచ్చరికల నేపథ్యంలో, విద్యాసంస్థలు తెరవడం సబబేనా? అనే నిలదీతలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రల్లో 20 వేలకు పైగా రోజువారీ కేసులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదే సమయంలో రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే అంశంపై తాజాగా ఓ నివేదిక వెలువడింది. మేథమెటికల్ మోడల్ ఆధారంగా ఐఐటీ కాన్పూర్, హైదరాబాద్‌కు చెందిన మణీంద్ర అగర్వాల్, ఎం.విద్యాసాగర్ నేతృత్వంలో అధ్యయనం సాగింది. ముఖ్యంగా కరోనా ఆంక్షల సడలింపు, డెల్టా వేరియంట్ విజృంభణ తదితర కారణాలు కొత్త కేసులు రావడానికి కారణమని అధ్యయనం తేల్చింది.
ఈ కేసులు క్రమంగా పెరిగి, అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని అంచనా. అయితే రెండో వేవ్‌తో పోల్చితే తక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యయన నివేదికలు చెప్పడం కాస్త ఊపిరి పీల్చుకునే అంశమే. మూడో వేవ్‌లో అత్యధికంగా ఒక్కరోజులో లక్ష కంటే తక్కువ కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని అంచనా. పరిస్థితులు మరీ చేయిదాటితే ఆ సంఖ్య గరిష్ఠంగా 1,50,000 గా ఉండొచ్చని అంటున్నారు.
ఇదే రెండో వేవ్‌లో కేసులు గరిష్ఠంగా 4లక్షలకు పైనే నమోదైన సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ విద్యా సంస్థలు తెరిచి విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టడం అవసరమా? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై సముచిత నిర్ణయం తీసుకోడానికి ప్రభుత్వాలకు కావాల్సినంత సమయం ఉంది. కావున విద్యార్థుల ప్రాణాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు, వైద్యనిపుణులు చెబుతున్నారు.