దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 29 వేల స్థాయిలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా డైలీ కేసులు 30 వేల లోపుకు తగ్గడం గమనార్హం. గత కొన్నాళ్లుగా అవరోహన క్రమంలో ఉన్న కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 30 వేల లోపు స్థాయికి తగ్గింది.
అయితే ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య మరో విడతగా పెరగడం మాత్రం ఆందోళన రేకెత్తిస్తూ ఉంది. ఈ అంశంపై ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి స్పందిస్తూ… కరోనా మూడో వేవ్ ఢిల్లీలో కొనసాగుతోందని ప్రకటించారు. అయితే ఈ మూడో వేవ్ లో కూడా పీక్ స్టేజ్ ను దాటేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ వేవ్ లు ఇంకా ఎన్ని ఉంటాయి? అవి ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానం లేనట్టే.
పండగ సీజన్లలో జనాలు అడ్డూఅదుపు లేకుండానే వ్యవహరించారు. చిన్న చిన్న పట్టణాల్లో, జిల్లా స్థాయి కేంద్రాల్లో విపరీత స్థాయిలో జనం గుమికూడారు. దసరా, దీపావళి సీజన్లలో రోడ్ సైడ్ షాపింగ్ విపరీతంగా సాగింది. మార్కెట్ ప్లేస్ లలో అత్యంత రద్ధీ ఏర్పడింది. ప్రజలు కరోనాను పూర్తిగా మరిచిపోయి గతంలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ సీజన్ల కరోనా వ్యాప్తి ప్రభావం ఎలా ఉంటుందో.. అతి త్వరలోనే తెలిసిపోయే అవకాశం ఉంది.
ప్రజలు కరోనా గురించి పట్టించుకోవడం మానేసి పూర్వపు స్థితిలో జనజీవనం సాగిస్తున్న రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. ఏపీలో స్కూళ్లు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో గత ఇరవై నాలుగు గంటల్లో ఆ రాష్ట్రంలో నమోదైన కొత్త కేసుల సంఖ్య వెయ్యికి లోపు మాత్రమే కావడం గమనార్హం. ఏపీలో 753 కొత్త కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది.
ఏపీ ఇప్పటికీ రోజుకు లక్ష స్థాయిలో పరీక్షలను నిర్వహిస్తూ ఉంది! సుమారు 90 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పరీక్షల విషయంలో రాజీ లేకుండా ముందుకు సాగుతున్న ఏపీలో కరోనా నంబర్లు తగ్గుముఖం పట్టడం ఊరటను ఇచ్చే అంశమే.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 17 వేల స్థాయిలో ఉన్నాయి. తగ్గుతున్న కరోనా నంబర్లను చూసి జనాలు రెచ్చిపోరాదని, వచ్చే ఏడాది మార్చి వరకూ ఇలాంటి తగ్గుదలలు నమోదై.. యాక్టివ్ కేసుల సంఖ్య జీరో స్థాయికి వచ్చే వరకూ.. కరోనా రహితం కాలేదని గుర్తుంచుకుని మసలు కోవాలని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.