కరోనా కేసుల విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో తరహా నంబర్లను చెబుతూ ఉంది. అవన్నీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో వెల్లడయ్యే నంబర్లు అని వేరే చెప్పనక్కర్లేదు. వాస్తవానికి కరోనా విషయంలో అంతు తేలాలంటే పరీక్షలే మార్గం అని ఆ వైరస్ ను ఒకరకంగా జయించిన సౌత్ కొరియా వంటి దేశాలు తేల్చి చెబుతున్నాయి. అయితే ఇండియా వంటి భారీ జనాభా ఉన్న దేశంలో కరోనా టెస్టులను భారీ స్థాయికి తీసుకెళ్లడం అంత తేలికగా సాధ్యం అయ్యే పని కాదు.
ఒక అధ్యయనం ప్రకారం.. అమెరికాలో రోజుకు కోటి టెస్టులు జరగాలట. అమెరికా జనాభాకు అనుగుణంగా చూస్తే.. రోజుకు కనీసం కోటి మందికి కరోనా టెస్టులు చేసి, వారి ఫలితాలను వెల్లడిస్తే కరోనా రోగులను సమూహం నుంచి వేరు చేయడానికి వీలవుతుందట. అమెరికా జనాభాకే రోజుకు కోటి టెస్టులు జరగాలంటే.. ఇండియా జనాభాకూ? రోజుకు నాలుగైదు కోట్ల పరీక్షలు జరిగితే కానీ.. టెస్టింగ్ ద్వారా కరోనా కట్టడి సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటి వరకూ ఇండియాలో గరిష్టంగా ఒకే రోజు 19 లక్షల వరకూ టెస్టులు చేసినట్టున్నారు.
అయితే ఆ టెస్టుల్లో కూడా కొన్ని రాష్ట్రాలదే ప్రముఖ వాటా, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, యూపీ వంటి రాష్ట్రాలు మాత్రమే టెస్టింగ్ పట్ల ఆసక్తితో పని చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. మిగతా రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణలోనే తీసుకుంటే.. టెస్టింగుల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది!
ఒక రాష్ట్రానికీ మరో రాష్ట్రానికీ గేట్లు బంద్ చేయడం లేదు. ఇలాంటప్పుడు పక్కపక్కన ఉన్న రాష్ట్రాలు భిన్నమైన రీతిలో వ్యవహరించడం వల్లా ఉపయోగం ఉండకపోవచ్చు. టెస్టింగుల సంఖ్యే తక్కువ అయితే బయటపడే కేసుల సంఖ్య కచ్చితంగా తక్కువగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి క్రమంలో రాష్ట్రాలు ఏ రోజుకారోజు వెల్లడిస్తున్న నంబర్లను ఎంత వరకూ నమ్మాలనేది ప్రజల విజ్ఞత.
నంబర్లు తక్కువగా వెల్లడిస్తున్న రాష్ట్రాల్లో.. ఏకంగా రాజకీయ ప్రముఖులే కరోనా బారిన పడుతున్నారు! అంటే.. జనాలతో కాస్త ఎక్కువ కలుస్తున్న వాళ్లకు కరోనా సోకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ఆ ఉదాహరణలతో స్పష్టం అవుతోంది. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా కరోనా సోకే తీవ్రత అంటూ ఒక జాబితాను విడుదల చేసింది. అలాంటి జాబితాను పరిశీలించి, ప్రజలు తాము ఎలాంటి పరిస్థితుల మధ్యన ఉన్నట్టో అర్థం చేసుకోవాలి. రోజువారీ కేసుల సంఖ్య మాత్రం చేసే పరీక్షలను బట్టి మాత్రమే ఆధారపడి కనిపిస్తూ ఉంది. టెస్టులు చేస్తే కేసుల నంబర్లు పెరుగుతాయి, చేయకపోతే అసలు కరోనా నే లేదనే పరిస్థితీని సృష్టించడం ప్రభుత్వాలకు పెద్ద కష్టం కానట్టుంది!