ఇండియాలో రికార్డు స్థాయిలో క‌రోనా రిక‌వ‌రీ!

ఇండియాలో క‌రోనా రిక‌వ‌రీ రేటు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ ఉంది. మ‌రోవైపు పెద్ద సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదు అవుతూ ఉన్నాయి. లాక్ డౌన్ మిన‌హాయింపులు మొద‌లై నెల గ‌డిచిపోయింది. ఈ క్ర‌మంలో రోజువారీ కేసుల…

ఇండియాలో క‌రోనా రిక‌వ‌రీ రేటు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ ఉంది. మ‌రోవైపు పెద్ద సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదు అవుతూ ఉన్నాయి. లాక్ డౌన్ మిన‌హాయింపులు మొద‌లై నెల గ‌డిచిపోయింది. ఈ క్ర‌మంలో రోజువారీ కేసుల సంఖ్య ప్ర‌తి రోజూ పెరుగుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. లాక్ డౌన్ ఉన్న స‌మ‌యంలో దేశం మొత్తం మీదా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుద‌ల వెయ్యి స్థాయిలో ఉండ‌గా, 30 రోజులు గ‌డిచే స‌రికి దిన వారీ కేసుల సంఖ్య దాదాపు 20 వేల‌కు చేరుకుంది. ఏ రోజుకారోజు కొత్త కేసుల సంఖ్యలో పెరుగుద‌ల పెరుగుతూనే ఉంది!

దీంతో ప్ర‌తి ఐదారు రోజుల‌కూ ల‌క్ష కేసుల సంఖ్య పెరిగే ప‌రిస్థితి వ‌చ్చింది. మొద‌టి ల‌క్ష కేసుల సంఖ్య చేర‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఇప్పుడు ఐదు రోజులు గ‌డిచేస‌రికే కొత్త‌గా ల‌క్ష కేసులు రిజిస్ట‌ర్ అవుతున్న ప‌రిస్థితి నెల‌కొంటూ ఉంది. 

అయితే దేశంలో రిక‌వ‌రీ రేటు కూడా కేసుల‌కు ధీటుగా పెరుగుతూ ఉంది. నిన్న ఒక్క రోజే దేశంలో దాదాపు 20 వేల మందిని డిశ్చార్జ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. వీళ్లంతా క‌రోనా నుంచి కోలుకున్నార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కొత్త కేసుల సంఖ్య‌, అలా రిక‌వ‌రీ అయ్యి, డిశ్చార్జి అయిన వారి సంఖ్య స‌మానంగా ఉండ‌టం ఊర‌ట‌ను ఇస్తున్న అంశంగా నిలుస్తోంది.

ఈ క్ర‌మంలో మొత్తం కేసుల సంఖ్య 6,25,544కు చేర‌గా, వీరిలో రిక‌వ‌ర్ అయిన వారి సంఖ్య 3,79,891 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,27,439 అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. రిక‌వ‌రీ రేటు 60 శాతానికి పైనే అని తెలిపింది.