రోజువారీ కరోనా కేసుల సంఖ్య చాన్నాళ్ల తర్వాత మూడు లక్షల స్థాయి లోపు నమోదు అయ్యింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2.81 లక్షల కరోనా కేసులు నమోదు అయినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత వారంలో కేసుల సంఖ్య ప్రతి రోజులూ మూడు లక్షలకు పైనే నమోదు అయ్యింది.
ఆదివారం కొత్తగా నమోదైన కేసుల సంఖ్య మూడు లక్షల లోపు కావడం, అంతకు ముందు వారం కూడా సగటున చూస్తే గ్రోత్ రేట్ తగ్గడంతో.. దేశంలో సెకెండ్ వేవ్ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయా? అనే ఆశావహ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఒక దశలో ఇండియాలో నాలుగు లక్షల స్థాయిలో రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అవి మూడు లక్షల్లోపుకు తగ్గడం ఏతావాతా ఊరటను ఇచ్చే అంశమే. చివరి సారి ఏప్రిల్ 21న ఇండియాలో మూడు లక్షల్లోపు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
దాదాపు నెల తర్వాత ఇలా కేసుల సంఖ్య అవరోహన క్రమంలో మూడు లక్షల్లోపుకు చేరింది. మే ద్వితీయార్థం నుంచి దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టవచ్చని వైరాలజిస్టులు తమ అంచనాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే జరుగుతుండవచ్చని సామాన్యులు కూడా ఆశిస్తున్నారు.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. నిన్న ఒక్క రోజే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య సుమారు లక్ష తగ్గిపోయాయి. 2.81 లక్షల కొత్త కేసుల రాగా, రికవరీల సంఖ్య అంతకు లక్ష ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35 లక్షల స్థాయికి చేరింది. అయితే మరణాల సంఖ్య మాత్రం గత వారం స్థాయిల్లోనే కొనసాగింది. 24 గంటల్లో కరోనా కారణంగా 4 వేలకు మందికి పైగా మరణించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
గత వారంలో గ్రోత్ రేట్ తగ్గిందని స్పష్టం అవుతోంది. అంతకంతకూ పెరగాల్సిన కేసుల సంఖ్య ఆ భయానక స్థాయిలో పెరగడం లేదని స్పష్టత వచ్చింది. ఈ వారం ప్రారంభంతో రోజువారీ కేసుల సంఖ్యలో మెరుగైన తగ్గుదల నమోదైంది. మరి ఈ వారంలో ఈ తగ్గుదలలు కొనసాగితే.. ఆసుపత్రులపై కూడా కేసుల లోడ్ తగ్గే అవకాశం ఉంది. కరోనా సెకెండ్ వేవ్ విషయంలో ఈ వారాంతానికి పూర్తి స్పష్టత రావొచ్చు.