చైనాలో పుట్టిన కరోనా ఇప్పటికే 15 దేశాలకు విస్తరించింది. ఇండియాలో కూడా కరోనా వైరస్ బయటపడింది. మొదటి కేసు కేరళలో, రెండో కేసు చెన్నైలో కనిపించింది. దీంతో దేశంలోని అన్ని నగరాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లో రేపట్నుంచి కరోనా పరీక్షలు చేయబోతున్నారు. ఎవరైనా తమకు కరోనా సోకిందని అనుమానంతో వస్తే, వాళ్లను ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
ఇప్పటికే కరోనా భయంతో 18 మంది గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీళ్లలో 11 మందికి కరోనా లేదని ప్రకటించిన వైద్యులు వారిని ఇళ్లకు పంపించారు. మిగతా వాళ్ల రిపోర్టులు పూణె నుంచి రావాల్సి ఉంది. మరోవైపు వైరస్ కు సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా అడిగేందుకు 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటుచేశారు. 040-24651119కు ఫోన్ చేసి కరోనాకు సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా అడగొచ్చు.
అటు చైనా నుంచి మరోసారి ఇండియాకు ప్రత్యేక విమానం వచ్చింది. ఈసారి 210 మంది భారతీయుల్ని స్వదేశానికి రప్పించారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించగా.. 95 మందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెంటనే వీళ్లందర్నీ హర్యానాలోని మానెసర్ కు పంపి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. దాదాపు 600 మందికి సరిపడా ఇక్కడ ప్రత్యేకంగా బెడ్లు, అత్యవసర ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా చైనాలో భారతీయులు ఉన్నారు. మరీ ముఖ్యంగా వూహాన్ సిటీలో ఇండియన్స్ ఇంకా ఉండిపోయారు. వాళ్లలో కర్నూల్ కు చెందిన శృతి అనే ఉద్యోగి కూడా ఉంది.
అటు చైనాను కరోనా వణికిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 304 మంది మరణించినట్టు చైనా ప్రకటించింది. మరో 14వేల మందికి వైరస్ సోకినట్టు ప్రకటించింది. చైనా నుంచి దాదాపు ప్రపంచదేశాలన్నీ కనెక్షన్ కట్ చేసుకున్నాయి. 10వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. చుట్టుపక్కల దేశాలన్నీ సరిహద్దులు మూసేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటర్నేషనల్ మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది.