కొవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్.. (సీపీఎస్). సినిమా రంగంలోని 24 శాఖలకు ఇది అదనం. అంటే 25వ శాఖ అన్నమాట. చిత్రీకరణలో పాల్గొనే ఏ ఒక్కరికీ కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకునే శాఖ. మాస్క్ ల దగ్గర్నించి శానిటేషన్ వరకు, అంబులెన్స్ మెయింటెనెన్స్ చేసే దాకా ఈ టీమ్ దే రెస్పాన్సిబిలిటీ. ప్రతి సినిమాకు ఇలాంటి ఓ టీమ్ ను నియమించుకోవాలని, ఇందులో వైద్యులు కూడా ఉండాలనేది ఓ ప్రతిపాదన. కొవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ పేరుతో ఇప్పటికే దీనిపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇంకో విశేషం ఏంటంటే.. చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ డెమో వీడియో తయారు చేయించుకుని, యూనిట్ లో మిగతా వారందరికీ దాన్ని వివరించాలట. మొదటగా రాధేశ్యామ్ యూనిట్ ఆ పనిచేస్తోందట. ఈ డెమో వీడియో త్వరలోనే బైటకు వదులుతారని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్. ఆచార్య, పుష్ప సినిమా యూనిట్ లు కూడా కొవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ని పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇదివరకే పీవీఆర్ థియేటర్స్ సంస్థ ఇలానే ఓ డెమో వీడియో విడుదల చేసింది. అన్ లాక్ తర్వాత సినిమా థియేటర్లకు అనుమతులొస్తే, పరిస్థితి ఎలా ఉంటుంది, తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనే విషయంపై ఓ డెమో వీడియో బైటకు వదిలారు. థియేటర్లోకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరికీ మాస్క్ లు ఇవ్వడం, వారికి శానిటైజర్లు ఇవ్వడం, లోపల ప్రతి సీట్ ని డిజిన్ఫెక్ట్ చేయడం.. బాత్రూమ్ ల పరిశుభ్రత.. అబ్బో చాలా తతంగమే చూపించారు.
డెమోలో అన్నీ బాగానే ఉంటాయి. వాస్తవంలో అవి ఎలా ఉంటాయనేదే అసలు సమస్య. పెద్ద పెద్ద థియేటర్స్ లో సోషల్ డిస్టెన్స్ పెట్టి టికెట్ రేటు పెంచినా కుదురుతుందేమో కానీ, చిన్న స్థాయి పట్టణాలు, గ్రామాల్లోని థియేటర్లలో అది కుదరని పరిస్థితి. రేపు సినిమా షూటింగుల్లో కూడా ఇదే జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. షూటింగ్ సెట్స్ లో కొవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగానే అలంకారప్రాయం అవుతుందనేది అందరి అనుమానం.
అలాంటప్పుడు సెట్స్ పైకి రావడానికి మన హీరోలు ఎంతవరకు ధైర్యం చేస్తారనేదే సమస్య. బాలీవుడ్ లో వెలుగు చూస్తున్న వరుస కరోనా కేసుల నేపథ్యంలో.. తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోలు ఇప్పుడప్పుడే మొహానికి మేకప్ వేసే ధైర్యం చేయకపోవచ్చు. కొవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమల్లోకి వచ్చినా పెద్ద సినిమాలు సెట్స్ పైకి రాకపోవచ్చు.