జగన్ కి ఎన్టీయార్ ఆశీస్సులు

అదేంటి జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీయార్ చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన ఆశీస్సులు జగన్ కి ఎలా అన్న డౌట్లు రావచ్చు. కానీ ఎన్టీయార్ మరణించేనాటికి ఆయన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ…

అదేంటి జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీయార్ చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన ఆశీస్సులు జగన్ కి ఎలా అన్న డౌట్లు రావచ్చు. కానీ ఎన్టీయార్ మరణించేనాటికి ఆయన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ నుంచి దూరంగా ఉన్నారు. పైగా చంద్రబాబుని ఆయన విమర్శించి మరీ కొత్త పార్టీ వైపుగా అడుగులు వేశారు. విధి మరోలా తలవడంతో ఆయన తీరని బాధతోనే తనువు చాలించారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

మొదట్లో ఎన్టీయార్ ని వ్యతిరేకించి తరువాత ఆయనకు టీడీపీ నేతలు దండలు వేయడం అన్నది వారి రాజకీయ‌ విధానం అనుకున్నా ఎన్టీయార్ ని మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజకీయాలకు అతీతంగానే చూస్తారు. ఆయన అలాగే చివరిదాకా నిలిచారు, మెలిగారు.

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ అందులో ఒక దానికి ఎన్టీయార్ పేరు పెట్టడం ద్వారా ఆ మహానుభావుడిని గౌరవించారు. ఆయన కీర్తిని శాశ్వతం చేశారు. దీని మీద వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, జగన్ చేసిన ఈ కార్యక్రమం సకల జనం మెచ్చేది అని అన్నారు.

ఎన్టీయార్ పేరు పెట్టడం ద్వారా జగన్ రాజకీయాలకు అతీతమైన గొప్ప నిర్ణయం తీసుకున్నారని, అలా  ఆ మహానుభావుడికి ఘన నివాళి ఇచ్చారని కొనియాడారు. ఈ మహత్తరమైన నిర్ణయానికి గానూ జగన్ కి ఎన్టీయార్ ఆశీస్సులు నిండుగా ఎపుడూ ఉంటాయని కూడా దాడి చెప్పుకొచ్చారు. 

ఇక నాడు మండలాల వ్యవస్థకు రూపకల్పన చేయడం ద్వారా ఎన్టీయార్ పాలనలో వికేంద్రీకరణ తీసుకువస్తే ఇపుడు గ్రామ సచివాలయాల తో పాటు ప్రతీ యాభై ఇళ్లకూ ఒక వాలంటీర్ ని నియమించడం ద్వారా జగన్ మరింతగా పాలనను ప్రజలకు  చేరువ చేశారు అని ప్రశంసించారు.

అంతే కాదు, జగన్ కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఏపీలో చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. ఏపీలో కేవలం రెండు జిల్లాలు తప్ప అన్నీ బ్రిటిష్ వారి హయాంలో ఏర్పాటు అయినవే అని ఆయన గుర్తు చేశారు. ఇపుడు సమూలమైంగా ప్రక్షాళన చేస్తూ జగన్ కీలకమైన అడుగులు వేశారని అన్నారు.

రానున్న కాలంలో ఏపీ అన్ని విధాలుగా కొత్త జిల్లాలతో పాలనాపర‌మైన వికేంద్రీకరణతో అభివృద్ధిని సాధిస్తుందని, ప్రభుత్వం చెప్పినట్లుగానే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాలన మొదలవుతుంది అని కూడా దాడి వీరభద్రరావు గట్టిగా చెప్పడం విశేషం. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎన్టీయార్ ఆశీస్సులు జగన్ కే నిండుగా ఉంటాయి అంటే టీడీపీ తమ్ముళ్ళు ఎలా రియాక్టు అవుతారో మరి.