గురువుకే తీరని అన్యాయం… ?

మాది తేడా పార్టీ, మిగిలిన వారికి భిన్నం అని కమలనాధులు ఎపుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మా పార్టీ ఎవరికీ అన్యాయం జరగదు, అందరికీ సమానంగా చూస్తామని అంటారు. అలాంటి పార్టీలో ఒక కురు…

మాది తేడా పార్టీ, మిగిలిన వారికి భిన్నం అని కమలనాధులు ఎపుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మా పార్టీ ఎవరికీ అన్యాయం జరగదు, అందరికీ సమానంగా చూస్తామని అంటారు. అలాంటి పార్టీలో ఒక కురు వృద్ధ నాయకునికి తీరని అన్యాయమే జరిగింది.

ఇవాళా నిన్నా కాదు, జనసంఘ్ కాలం నాటి నుంచి పార్టీలో పనిచేస్తున్న నేత. అసలు దక్షిణాదిన బీజేపీ అంటే ఎవరికీ తెలియని రోజుల్లో 1980లోనే విశాఖ కార్పోరేషన్ తొలి మేయర్ గా బీజేపీ వ్యక్తిని గెలిపించిన నాయకుడు పీవీ చలపతిరావుకు పార్టీలో అన్ని రకాలుగా అన్యాయమే జరిగింది అన్న మాట అయితే ఉంది.

జన‌సంఘ్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్రా నుంచి పాతినిధ్యం వహించిన పీవీ 1980లో బీజేపీ ఆవిర్భవించినపుడు జాతీయ స్థాయిలో వాజ్ పేయ్ ప్రెసిడెంట్ గా ఉంటే ఉమ్మడి ఏపీకి తొలి అధ్యక్షుడిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. 

పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఈ సీనియర్ నేతకు ఇప్పటికి అనేక మార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని అభిమానులు బాధపడతారు. ఆయనను అందరి కంటే ముందు గౌరవించి గవర్నర్ పదవి ఇవ్వాలని కోరే వారు కూడా ఉన్నారు. 

అయితే వాజ్ పేయ్ హయాంలో ఒకసారి ఆ ప్రతిపాదన వచ్చిన నాడు ఏపీ బీజేపీలో చక్రం తిప్పిన ఒక బడా నాయకుడు వేసిన అడ్డుపుల్ల వల్ల అది సఫలం కాలేదు అన్న ప్రచారం అయితే ఉంది. మొత్తం మీద బీజేపీ జెండా ఆంధ్రాలో పాతడానికి యావత్తు జీవితాన్నే అర్పించిన ఈ వృద్ధ నేతకు మాత్రం బీజేపీ నుండి దక్కింది ఏమీ లేదన్న బాధ అయితే అందరిలోనూ ఉంది.