బిహార్‌లో లోక్ జనశక్తి పార్టీలో పుట్టిన ముసలం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో కూడా అలాంటి ముసలం పుట్టక తప్పదా? అంటే, ఔననే సమాధానం వస్తోంది. బిహార్‌లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు పట్టిన గతే భవిష్యత్‌లో టీడీపీ వారసుడు నారా లోకేశ్‌కు పడుతుందనే అభిప్రాయాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.
చిరాగ్ పాశ్వాన్, నారా లోకేశ్‌కు మధ్య రాజకీయ పోలిక పెట్టి భవిష్యత్‌ను అంచనా వేస్తుండడం విశేషం. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందారు. పార్టీ పెద్ద దిక్కు పోవడంతో లోక్ జనశక్తి చుక్కాని లేని నావలా ప్రయాణిస్తోంది. ఏపీలో మన చంద్రబాబు ఎలాగో, బిహార్‌లో రాంవిలాస్ పాశ్వాన్ కూడా అంతకంటే శక్తిమంతమైన నాయకుడు.
బిహార్ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఏకైక దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ కూటమికి దగ్గరి వాడిగా పాశ్వాన్‌కు పేరు. బిహార్‌లో పాశ్వాన్ సొంత పార్టీ పెట్టుకుని 2005 అసెంబ్లీ ఎన్నికలలో గణనీయమైన సీట్లు సంపాదించారు. హంగ్ అసెంబ్లీకి కారణమయ్యారు. దీంతో అప్పటి నుంచి పాశ్వాన్ పేరు చెబితే జెడి(యు) నేత, ముఖ్యమంత్రి నితీష్ మండిపడతారు.
రాంవిలాస్ పాశ్వాన్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో తన కుమారుడు చిరాగ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించారు. 2014లో చిరాగ్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో పాశ్వాన్‌తో పాటు మరో ఐదుగురు లోక్‌జనశక్తి నుంచి లోక్‌స భకు ఎన్నికయ్యారు. ఆ ఐదుగురిలో రామ్ విలాస్ పాశ్వాన్ ప్రియ సోదరుడు పశుపతి కుమార్ పారస్ కూడా ఉన్నారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని నిర్ణయాలనూ చిరాగ్ పాశ్వానే తీసుకున్నారు. అయితే నితీష్‌తో విభేదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగారు.
ఇలా చేయడం చిరాగ్ చిన్నాన్న, లోక్‌సభ సభ్యుడు పశుపతి కుమార్ పారస్‌కు ఇష్టం లేదు. కేవలం ఒకే ఒక్క సభ్యుడు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఎల్‌జేపీ ఏకైక ఎమ్మెల్యే రాజ్‌కుమార్ సింగ్ జేడీయూలోకి మూడు నెలల క్రితం వెళ్లిపోయాడు. పాశ్వాన్ మృతితో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి.
చిరాగ్ చిన్నాన్న పశుపతి, మిగిలిన నలుగురు లోక్‌సభ సభ్యుల్ని కూడగట్టి …చిరాగ్‌పై తాజాగా తిరుగుబాటు చేశారు. తాము ఐదుగురం ఒకటేనని, తమను ప్రత్యేకంగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్ దగ్గరకు వెళ్లి అడిగారు. సభలో తమ నేతగా చిరాగ్‌ను తొలగించాలని, పరాస్‌ను కొత్త నేతగా గుర్తించాలని కోరారు. ఇందుకు స్పీకర్ అంగీకరించారు. తిరుగుబాటు ఎంపీలు ఐదుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చిరాగ్ పాశ్వాన్, చిరాగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్టు పారస్ పరస్పరం ప్రకటనలు చేసుకున్నారు.
భవిష్యత్‌లో నారా లోకేశ్ చేతికి టీడీపీ పగ్గాలు ఇస్తే, బిహార్‌లో చిరాగ్‌కు ఎదురైన చేదు అనుభవమే ఇక్కడ పునరావృతం అవుతుందనే చర్చ పెద్ద ఎత్తున ఏపీలో జరుగుతోంది. కేవలం చంద్రబాబు పెద్దరికంపై గౌరవంతో లోకేశ్‌పై ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీ నేతలు, కార్యకర్తలు భరిస్తున్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
చిరాగ్ కనీసం లోక్‌సభ సభ్యుడిగా గెలిచారని, ఇక్కడ లోకేశ్‌కు అంత సీన్ లేదని సొంత పార్టీ శ్రేణులే బహిరంగంగా చెబుతున్నాయి. ఈ సందర్భంగా మంగళగిరిలో ఓటమిపాలైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తానే ఎమ్మెల్యేగా గెలవలేని నాయకుడు, ఇక పార్టీని ఎలా నడిపిస్తారనే నిలదీతలు ఎదురవుతున్నాయి.
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, పార్టీని చంద్రబాబు లాక్కోవడాన్ని …ఆ కుటుంబంలోని యువ హీరోలు జీర్ణించుకోలేకున్నారనే అభిప్రాయాలు చాలా కాలంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలనే డిమాండ్స్ ముందుకు రావడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ విషయంలో చంద్రబాబు అప్రమత్తం కావాలని బిహార్‌లో చిరాగ్ ఉదంతం హెచ్చరిస్తోందని చెప్పక తప్పదు.