నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇక వదిలేసినట్టేనా? అంటే, ఔననే సమాధానం వస్తోంది. తాజాగా కొత్త అంశాన్ని టీడీపీ నెత్తికెత్తుకుంది. అది డాక్టర్ సుధాకర్ మృతి అంశం. డాక్టర్ సుధాకర్ దళితుడు కావడంతో, ఆ సామాజిక వర్గంలో ఎంతోకొంత సానుభూతి పొందేందుకు పనికొస్తుందనే భావనతో డాక్టర్ సుధాకర్ గుండె పోటు మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డాక్టర్ సుధాకర్‌ది ప్రభుత్వం చేసిన హత్యగా చంద్రబాబు ఘాటు విమర్శ చేసి, పార్టీకి దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ఆరోపణల తర్వాత వరుసగా ఆ పార్టీ నాయకులు అదే నినాదంతో మీడియాకు ఎక్కారు.
డాక్టర్ సుధాకర్ మృతి తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసినట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఒక సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి చివరికి ఇలా అంతమొందించారని మండిపడ్డారు. ఇది గుండెపోటు కాదని… ప్రశ్నించినందుకు ప్రభుత్వం చేసిన హత్య ఇది అని లోకేశ్ విమర్శించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా ఇదే అంశంపై విమర్శలు గుప్పించారు. నోరెత్తితే కేసులు.. ప్రశ్నిస్తే సంకెళ్లు అని ఆయన విరుచుకుపడ్డారు. అంతేకాదు, ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదంటున్న టీడీపీ నేతలు అంటున్న మాటలు వినబడుతున్నాయా వైఎస్ జగన్ అని దేవినేని ప్రశ్నించారు.
టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ మృతి బాధాకరమని పేర్కొన్నారు. దళితుల పట్ల జగన్ సర్కార్ చూపుతున్న పైశాచిక ప్రేమకు డాక్టర్ సుధాకర్ గారి మరణం ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొ న్నారు. ఇది ముమ్మాటికీ మానసిక హత్యేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఇలా ప్రతి టీడీపీ నేత మూకుమ్మడిగా డాక్టర్ సుధాకర్‌ను జగన్ సర్కార్ హత్య చేసినట్టు చిత్రీకరించడాన్ని చూడొచ్చు. ఇంత కాలం రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్‌తో పొద్దు గడిపిన టీడీపీకి సుప్రీంకోర్టు తీర్పుతో మాట్లాడ్డానికి ఏమీ లేకపోయింది.
మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని రఘురామను హెచ్చరించిన నేపథ్యంలో కొత్త సబ్జెక్ట్ కోసం వెతుకుతున్న టీడీపీ డాక్టర్ సుధాకర్ ఆకస్మిక మరణంపై ఎంచుకున్న మార్గం ఏ మాత్రం రాజకీయ ప్రయోజనం కల్పిస్తుందో కాలమే జవాబు చెప్పాలి.
ఇంతకూ రఘురామ ఎపిసోడ్‌లో టీడీపీకి వచ్చిన లాభం ఎంతో లెక్కగట్టిందా? ఇప్పుడు డాక్టర్ సుధాకర్ మరణంపై మొదలు పెట్టిన రాద్ధాంతం ఏ మాత్రం ప్రయోజనం కలిగిస్తుందో ఆ పార్టీ లెక్కలేస్తోందా? ఏది ఏమైనా ప్రస్తుతానికైతే రఘురామ అంశాన్ని వదిలేసినట్టే!