విశాఖ అభివృద్ధి అంటే గిట్టదు, ఈ నగరం మీద కనీసమైన ప్రేమ కూడా టీడీపీ నేతలకు లేదని విఎమ్మార్డీయే చైర్ పర్సన్, వైసీపీ మహిళా నాయకురాలు అక్రమాని విజయనిర్మల నిప్పులు చెరిగారు. విశాఖ ఓట్లు సీట్లూ కావాలి, కానీ నగరం మాత్రం అలాగే ఉండిపోవాలా అంటూ తెలుగు తమ్ముళ్లను నిలదీస్తున్నారు.
విశాఖ నుంచి మూడు సార్లు గెలిచి ఎమ్మెల్యే అయిన వెలగపూడి రామక్రిష్ణ బాబు ఎపుడూ జై అమరావతి అంటారని ఆమె విమర్శించారు. ఇక విశాఖలో లక్షన్నర మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనుకుంటే కోర్టుకు వెళ్ళి కేసులు వేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
వెలగపూడి లాంటి వారు విశాఖ మీద తమ చిత్తశుద్ధిని చాటుకోవాలంటే పరిపాలనా రాజధానిగా స్వాగతించాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖ సర్వతోముఖాభివృద్ధి కోసం వైసీపీ సర్కార్ మాస్టర్ ప్లాన్ ని రూపకల్పన చేస్తే దాన్ని కూడా విమర్శిస్తూ అడ్డుకోవడం ఏంటని విజయనిర్మల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ వాసులు ఈ సంగతి గ్రహించే టీడీపీని వరసబెట్టి ఓడిస్తూ వస్తున్నారని కూడా ఆమె అంటున్నారు. మొత్తానికి తెలుగు తమ్ముళ్లకు దేవుడి మీద భక్తా ప్రసాదం మీదా అంటే జవాబు నగరవాసులకే తెలుసు అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.