విశాఖ మీద పగ పట్టేశారా… ?

అదేంటో విశాఖ తల రాత అసలు ఏమీ బాగా లేదు. దేశంలోని చెప్పుకోదగిన నగరాలలో విశాఖ కూడా ఒకటి అని అంతా భావిస్తారు. అలాంటి నగరం అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి కూడా జోరుగా సాగుతుంది…

అదేంటో విశాఖ తల రాత అసలు ఏమీ బాగా లేదు. దేశంలోని చెప్పుకోదగిన నగరాలలో విశాఖ కూడా ఒకటి అని అంతా భావిస్తారు. అలాంటి నగరం అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి కూడా జోరుగా సాగుతుంది అని కూడా ఆర్ధిక మేధావులు చెబుతారు. మరి రాజకీయ మేధావులకు మాత్రం ఈ లెక్కలు ఏవీ అక్కరలేనట్లుగానే  ఉంది అనుకోవాలేమో.

ఇదిలా ఉంటే విశాఖలో బంగారం లాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం రెక్కలు కట్టుకుని మరీ వాయువేగంతో దూకుడు చేస్తోంది. ఢిల్లీ చుట్టూ ఉక్కు కార్మిక నాయకులు ప్రదక్షిణం చేస్తున్నా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టినా కూడా కేంద్రం పట్టించుకుంటుందా అన్నది విశాఖ సముద్రమంత పెద్ద డౌట్.

ఆ సంగతి అలా ఉంచితే ఎపుడో రెండున్నరేళ్ల క్రితం విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం దాని ఏర్పాటు విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతోంది. విశాఖ రైల్వే జోన్ ఎపుడు ప్రారంభం అవుతుందో చెప్పలేమనే కేంద్ర రైల్వే మంత్రి అశ్వ్ని వైష్ణవ్ ఈ రోజుకీ అంటున్నారు. జోన్ మొదలవ్వాలంటే చాలా విషయాలు పరిగణంలోకి తీసుకోవాలట. అవేమిటో ఎవరికీ బోధపడని విషయమే మరి.

ఇక నూటాభై ఏళ్ల చరిత్ర కలిగి దేశంలోని లాభాల బాటలో ఉన్న వాల్తేరు డివిజన్ ని విశాఖ జోన్ లో కలిపి ఉంచుతారా మహా ప్రభూ అంటే అది కూడా ఏమీ చెప్పలేమనే అంటున్నారు. అంటే విశాఖ జోన్ అన్నది ఎపుడు సాకారం అవుతుందో తెలియదు కానీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెగనమ్మడం ఖాయమన్న క్లారిటీ మాత్రం కేంద్ర పెద్దలు గట్టిగానే  ఇస్తున్నారు. 

ఇలా రెండిందాలా విశాఖకు నష్టం జరిగిపోతోంది. ఇంతకీ విశాఖ మీద ఇంత పగ ఎందుకు స్వామీ అంటే జవాబు ఎవరికీ తెలియదేమో. దానికి  కూడా అస్పష్టంగానే బదులిస్తారేమో.